
ఐఏఎస్ అయ్యాడు!
నాన్నమాటతో
ఉన్నత ఉద్యోగం.. రూ.కోటి ప్యాకేజీ.. జీవిత భాగస్వామికీ మంచి కొలువు.. మంచి సంసారం..సాఫీగా సాగే జీవనం.. అయినా ఏదో తెలియ ని వెలితి.. అసంతృప్తి.. ఏదో సాధించాలన్న తపన.. ఎలాగైనా కలెక్టర్ కావాలన్న పదే పదే గుర్తుకు వచ్చే చిన్ననాటి నాన్న మాట.. అతడిని సివిల్స్ వైపు నడిపించింది. అదే లక్ష్యం.. పట్టుదల..కృషి.. స్వీయశిక్షణ.. ప్రణాళిక.. మొక్కవోని ఆత్మస్థైర్యం.. వెరసి సివిల్ ర్యాంకర్‌గా నిలిచారు బైరెడ్డిపల్లె వాసి రంపా శ్రీకాంత్.
పలమనేరు: లక్ష్యం కోసం కష్టపడి ప్రయాణిస్తేనే అది తప్పకుండా దక్కుతుందంటున్నారు ఇటీవల సివిల్ సర్వీసెస్‌లో 904 ర్యాంకు సాధించిన బైరెడ్డిపల్లి వాసి రంపం శ్రీకాంత్. ఉత్తమ ఉద్యోగం ఉన్నా జీవితంలో ఏదో తెలియని లోటు.. తాను సివిల్ సర్వేంట్ కావాలన్న తపనతో సివిల్స్ కోసం రోజుకు ఎనిమిది గంటల కష్టపడి చదువుతూ, కోచింగ్ తీసుకుంటేనే పరీక్షలు ఉత్తీర్ణత సాధించగలమన్న ఆలోచనను పక్కన పెట్టి, స్వీయశిక్షణతోనే తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించారు.
రూ.కోటి పాకేజీ కంటే తండ్రి మాటే వేదంగా..
‘నాన్న నువ్వు బాగా చదివి ఎలాగైనే కలెక్టర్ కావాలి.. అప్పుడే మనలాంటి పేదలకు సాయంగా ఉండొచ్చు.’ అని తండ్రి నాగరాజు చిన్నప్పుడు శ్రీకాంత్‌కు చెప్పిన మాట ఎప్పుడూ గుర్తు పెట్టుకున్నారు. ప్రఖ్యాత కంపెనీలో భారీ ప్యాకేజీతో కొలువున్నా సంతృప్తి చెందలేదు. సివిల్స్ కొట్టాలనే తపన శ్రీకాంత్‌ను వేధిస్తూనే ఉండేది. దీంతో 2021 నుంచి ఆఫీసు పని ముగిశాక స్వీయ శిక్షణతో నాలుగు సార్లు సివిల్స్ రాసి, ఈ సారి ర్యాంకర్‌గా నిలిచారు.
కోచింగ్‌తోనే ఐఏఎస్ ఛాన్స్ భావన పొరబాటు
ఆన్‌లైన్‌లో మెటీరియల్‌తో స్వయంగా చదివా డీఎంఎంగా మంచి జీతం ఉన్నా అసంతృప్తి చిన్నప్పుడు తండ్రి మాటే జీవిత బాటగా.. సివిల్ సర్వీసెస్‌లో 904 ర్యాంకర్ శ్రీకాంత్
కష్టపడితే ఎప్పటికై నా విజయం
క్యాట్ రాసిన అనుభవంతో సివిల్స్‌కు స్వయంగా చదవడం మొదలు పెట్టా. ఆన్‌లైన్‌లో మెటీరియల్, డైలీ న్యూస్ పేపర్లు చదవాను. ఆప్షనల్‌గా పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పెట్టుకున్నా. ఇంటర్వ్యూలో సైతం ఎక్కువగా అంతర్జాతీయ వ్యవహారాలైన ఉక్రెయిన్ వార్, చైనా క్యాఫ్టలిస్ట్‌జం, టెర్రరిజం తదితరాలపైనే ఎక్కువ ప్రశ్నలడిగారు. చివరగా మనం చిన్నపాటి గ్రామంలో ఉన్నాం కదా ఐఏఎస్ కావాలంటే ఢిల్లీ కెళ్లి కోచింగ్ తీసుకోవాలనే మాట పక్కన పెట్టి ధైర్యంగా ముందుకెళ్లాలి.
– రంపం శ్రీకాంత్, బైరెడ్డిపల్లి
ఇదీ కుటుంబ నేపథ్యం
పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి రంపం శ్రీకాంత్ స్వగ్రామం. తండ్రి నాగరాజు గంగవరం పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. తల్లి రేణుక గృహిణి. శ్రీకాంత్ బైరెడ్డిపల్లెలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ఆపై 6,7 తరగతులు అక్కడే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివారు. 8 నుంచి 10వ తరగతి వరకు పలమనేరులోని లిటిల్ ఏంజెల్స్, ఇంటర్ శ్రీ చైతన్యలో చదివారు. ఆపై హైదరాబాద్‌లోని సీబీఐటీ బీటెక్ కంప్యూటర్ సైన్సు, తరువాత బెంగళూరులోని ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేశారు. తొలుత అమెజాన్‌లో ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం గూగూల్‌లో రూ.కోటి ప్యాకేజీతో ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు స్వీయశిక్షణ పొందుతూ స్వయంగా చదివారు. తిరుపతికి చెందిన అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జోత్న్స కుమార్తె శ్రావ్యను ఐదేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. శ్రావ్య సైతం బెంగళూరులోని టార్గెట్ కంపెనీలో ఫైనాన్స్ మేనేజర్‌గా పనిచేస్తోంది. వీరికి మూడేళ్ల పాప ఉంది.