చిత్తూరు అర్బన్: జిల్లా పోలీసుశాఖలో నాలుగో తరగతి ఉద్యోగిగా పనిచేస్తూ ఈనెల 19న మరణించిన శంకరమ్మ కుటుంబానికి రూ.1.50 లక్షల ఆర్థిక సాయాన్ని ఏఎస్పీ రాజశేఖర్‌రాజు శుక్రవారం అందజేశారు. చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో మృతురాలి కుమారుడు చంద్రబాబుకు ఐడీఆర్‌ఎఫ్ నిధుల నుంచి రూ.లక్ష, విడో ఫండ్ నుంచి రూ.50 వేలు, మొత్తం రూ.1.50 లక్షలు చెక్కు రూపంలో అందజేశారు.
అర్హులకు అందుతున్న వ్యవసాయ పరికరాలు
పలమనేరు: పలమనేరు వ్యవసాయశాఖ డివిజన్‌కు సంబంధించి సబ్సిడీ వ్యవసాయపరికరాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధిత వ్యవసాయశాఖ అధికారులు వారు కొరుకున్న పరికరాలను పంపిణీ చేస్తున్నారు. ఆ మేరకు పలు మండలాల్లో శుక్రవారం రైతులకు వీటిని రైతు సేవా కేంద్రాల సిబ్బంది ద్వారా పంపిణీ చేశారు. గత నెల 9వ తేదీన సాక్షి దినపత్రికలో ‘తమ్ముళ్లకే యంత్రసాయం’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ అదే రోజు సమావేశం నిర్వహించారు. అర్హులైన వారికి వ్యవసాయ పరికరాలు విధిగా అందించాలని ఏఓలకు సూచించారు. ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. దీంతో పరికరాల పంపిణీ సజావుగానే సాగుతోంది. ఆ మేరకు పలమనేరు మండలంలోని కల్లాడు సచివాలయంలో సైతం పార్టీలకతీతంగా రైతులకు అవరసమైన పనిముట్లను సిబ్బంది పంపిణీ చేశారు.
బావిలో శవమై తేలిన మహిళ
పూతలపట్టు (కాణిపాకం): పూతలపట్టు మండలంలో అదృశ్యమైన ఓ మహిళా బావిలో శవమై తేలింది. పోలీసుల కథనం మేరకు.. పూతలపట్టు మండలం గాండ్లపల్లికి చెందిన లక్ష్మి(70) అనే మహిళ నాలుగు రోజుల కిందట అదృశ్యమైంది. అప్పటి నుంచి కుటుంబసభ్యులు ఆమె ఆచూకీ కోసం గాలించారు. శుక్రవారం సాయంత్రం గ్రామానికి సమీపంలో ఉండే బావి నుంచి దుర్వాసన వచ్చింది. దీంతో స్థానికులు పూతలపట్టు సీఐకి సమాచారం అందజేశారు. పోలీసులు బావి వద్దకు చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా కాలు జారి పడిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

పోలీసు కుటుంబానికి ఆర్థిక సాయం