
కర్ణాటకలో శవమై తేలిన కుప్పం మహిళ
కుప్పంరూరల్: భార్య ఆస్తిపై కన్నేసిన భర్త 2021లో బావమరిదిని, తాజాగా భార్య ను చంపి శవాన్ని అడవిలో పడేసి తన క్రూరత్వాన్ని చాటుకున్నాడు. రెండు వా రాల కిందట హత్యకు గురైన మహిళ మృతదేహాన్ని శుక్రవారం కర్ణాటక పోలీసులు వెలికి తీశారు. వివరాల్లోకి వెలితే..కుప్పం మండలం, చీగలపల్లి గ్రామానికి చెందిన వికలాంగుడు వెంకటేష్, చిన్నపాప దంపతులకు రాజేశ్వరి, వెంకటాచలం పిల్లలు ఉన్నారు. కుమార్తె రాజేశ్వరిని పదేళ్ల కిందట కర్ణాటక రాష్ట్రం బంగారుపేట తాలూకా పాతరామగోలు గ్రామానికి చెందిన రాఘవేంద్రకు ఇచ్చి వివాహం చేశాడు. మొదట్లో వారి కాపురం సజావుగా సాగింది. వారికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. 2021 ఉగాది పండుగ సందర్భంగా వెంకటేష్ తన కుమార్తె రాజేశ్వరిని కుటుంబ సమేతంగా చీగలపల్లెకు రావాలని ఆహ్వానించాడు. తండ్రి కోరిక మేరకు రాజేశ్వరి తన భర్త రాఘవేంద్ర, ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చింది. అప్పటికే కొంత ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న రాఘవేంద్ర పండుగ పూట మామ వెంకటేష్‌ను కొంత డబ్బు ఇవ్వమని అడిగాడు. తమ వద్ద లేదని వెంకటేష్ తిరస్కరించాడు. ఆస్తి అమ్మి అమ్మి అయినా ఇవ్వాలని గొడవకు దిగాడు. తనకు 3 ఎకరాల ఆస్తి మాత్రమే ఉందని, దాన్ని తన కొడుకు వెంకటాచలానికి ఇవ్వాలని, అమ్మడం కుదరదని తెగేసి చెప్పాడు. దీంతో రాఘవేంద్ర వెంకటాచలంపై కసి పెంచుకుని, జనసంచారం లేని ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేశాడు. మృతదేహాన్ని గ్రామానికి సమీపంలోని రోడ్డుపై పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణకు ప్రయత్నించాడు. బిడ్డ మృతిపై వెంకటేష్ కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అనుమానితుడైన రాఘవేంద్రను అరెస్టు చేసి, విచారణ జరపగా హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో హతుడు రాఘవేంద్ర జైలుకు వెళ్లాడు. అప్పటి నుంచి రాజేశ్వరి తన ఇద్దరి పిల్లలతో స్వగ్రామం చీగలపల్లిలోనే ఉండిపోయింది. నిత్యం బెంగళూరుకు రాకపోకలు సాగిస్తూ తల్లిదండ్రులు, పిల్లలను పోషిస్తోంది.
తాజా భార్య రాజేశ్వరి..
ఏడాది తరువాత జైలు నుంచి బయటికి వచ్చిన రాఘవేంద్ర ఎలాగైనా భార్యను హతమార్చి ఆస్తి కాజేయాలని కసిపెంచుకున్నాడు. ఈ క్రమంలో మూడు నెలలుగా భార్య రాజేశ్వరితో తాను మారిపోయానని నమ్మబలికి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఫోన్లలో మాట్లాడుతున్నాడు. దీంతో రాజేశ్వరి భర్తను నమ్మింది. ఈ క్రమంలో ఏప్రిల్ 11న రాజేశ్వరి ఉదయం లేచి కూలీ పనులకు బెంగళూరుకు బయలుదేరింది. భర్త బంగారుపేటలో దిగమని ఆదేశించడంతో రాజేశ్వరి బంగారుపేటలో దిగింది. భర్తతో కలిసి పాతరామగోలు అటవీ ప్రాంతానికి వెళ్లారు. వారం రోజులు గడిచిన బెంగళూరు వెళ్లిన రాజేశ్వరి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు వెంకటేష్, చిన్నపాప దంపతులు కుప్పం పోలీసులను ఆశ్రయిస్తారు. పోలీసులు కేసు నమోదు చేసి రాజేశ్వరి కాల్‌డేటాను పరిశీలించగా, అందులో భర్త రాఘవేంద్రతో మాట్లాడినట్లు నిర్ధారించుకున్నారు. బూదికోట పోలీసుల సహకారంతో భర్త రాఘవేంద్రను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా, రాజేశ్వరిని తాను హత్య చేసినట్లు అంగీకరించాడు. శుక్రవారం కర్ణాటక పోలీసులు అడవిలో కుళ్లిపోయిన రాజేశ్వరి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపేటకు తరలించి బంధువులు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఇద్దరు పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాజేశ్వరి హత్య, పిల్లల రోదన చూసి చీగలపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.