కాశీబుగ్గ ఘటన ప్రభుత్వ హత్యలే!
చిత్తూరు అర్బన్ : శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన పూర్తిగా నిఘా వైఫల్యమేనని.. దీనికి ప్రభు త్వ హత్యలుగానే భావిస్తున్నామంటూ చిత్తూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎంసి.విజయానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం, ఒక్కో ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలడి డిమాండ్ చేశారు. కాశీబుగ్గ తొక్కిసలాటలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆదివారం రాత్రి చిత్తూరు నగరంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ సమన్వయకర్త ఎంసి.విజయానందరెడ్డి మాట్లాడుతూ.. ఏకాదశి పురస్కరించుకుని ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తా రని ఆలయ ధర్మకర్త పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినట్లు మీడియాకు తెలిపారని.. అయినా నిఘా కొరవడటంతో అమాయకులైన భక్తులు మృతి చెందారన్నారు. తిరుపతి, సింహాచలం హిందూ ఆలయాల వద్ద జరిగిన తొక్కిసలాట.. భక్తుల మృతి మరువక మునుపే మరో ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. హిందూ ఆలయాలపై ప్రభుత్వ నిర్లక్ష్యధోరణికి అమాయకులైన భక్తులు ప్రాణాలు విడుస్తున్నారన్నారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న భక్తులకు తమ పార్టీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కాపాడుతుంటే.. ఈ ఘటన నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి నకిలీమద్యం కేసులో సంబంధంలేకున్నా జోగి రమేష్‌ను అరెస్టు చేశారన్నారు. నకిలీ మద్యం కేసు సీబీఐకు అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ వేసిన వెంటనే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివి.గాయత్రీదేవి, పార్టీ ఉద్యోగ–పెన్షనర్ల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయసింహారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో హిందూ ఆలయాల వద్ద తొక్కిసలాటలు జరుగుతూ భక్తుల ప్రాణాలు పోతున్నా.. ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జ్ఞానజగదీష్, సరళామేరి, అంజలిరెడ్డి, హరిణిరెడ్డి, హనీషారెడ్డి, ముత్తు, చందు, నారాయణ, బిందు తదితరులు పాల్గొన్నారు.


