‘నాడి’తప్పిన పల్లె వైద్యం
జిల్లాలో వైద్యసేవలపై నిర్లక్ష్యం విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు గ్రామాల్లో కనిపించని వైద్యాధికారులు, సిబ్బంది జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై వైద్య బృందానికి అవగాహన శూన్యం ఆరోగ్యసేవలపై లోపిస్తున్న పర్యవేక్షణ కుర్చీలకే పరిమితమైన ప్రోగ్రాం ఆఫీసర్లు నేడు జిల్లాకు రానున్న కేంద్ర బృందం
విలేజ్ హెల్త్ క్లినిక్‌లూ అదేదారిలోనే..
జిల్లాలో పల్లె వైద్యం గాడి తప్పింది. వైద్యసేవలపై నిర్లక్ష్యం అలుముకుంది. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నా వైద్య బృందం పల్లెల్లో కరువుతోంది. పలు ఆరోగ్య కేంద్రాలు ప్రజాసేవకు దూరంగా నిలిచాయి. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరుపై పర్యవేక్షణ కొరవడుతోంది. ప్రోగ్రాం ఆఫీసర్లు కుర్చీలకు పరిమితమవుతున్నారు. తద్వారా కార్యక్రమ నిర్వహణ పక్కదారి పడుతోంది. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా అమలయ్యే పథకాల పనితీరుపై పరిశీలన చేపట్టేందుకు నేడు జిల్లాకు కేంద్ర బృందం రానుంది.
కాణిపాకం : జిల్లాలో 50 పీహెచ్‌సీలు, 462 విలేజ్ హెల్త్ క్లినిక్‌లున్నాయి. పీహెచ్‌సీల్లో ఇద్దరు డాక్టర్లతో పాటు 12 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌ల్లో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ఉండాల్సి ఉంది. అయితే వీరిలో చాలా మంది బాధ్యతలను విస్మరిస్తున్నారు. ప్రజాసేవను తేలికగా తీసుకుంటున్నారు. ఈ కారణంగా పల్లెల్లో వైద్య సేవలు మొక్కుబడిగా మారాయని పల్లె జనం మండిపడుతోంది.
పర్యవేక్షణ లేక ఇష్టారాజ్యం
ప్రధానంగా పీహెచ్‌సీల్లో మందుల కొరత వేధిస్తోంది. ఆరోగ్య కేంద్రాలు తెరుచుకోవడం లేదు. ఉదయం 9 గంటలకు తెరవాల్సిన పీహెచ్‌సీలు 10 గంటలకు పైగా తెరుచుకుంటున్నాయి. డాక్టర్లు 10 గంటలకుపైగా వచ్చి వెళ్లిపోతున్నారు. కొందరు డాక్టర్లు గంటకే డుమ్మా కొడితే..మరికొందరు మధ్యాహ్నానికి జంప్ అవుతున్నారు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్లు సైతం మధ్యాహ్నానికి గదికి తాళం పెడుతున్నారు. పీహెచ్‌సీలు 24 గంటలు పనిచేయాల్సి ఉండగా...సాయంత్రానికి తలుపులు మూసుకుంటున్నాయి. రాత్రి సిబ్బంది అసలు ఉండడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా సుఖ ప్రసవాల లక్ష్యం పూర్తిగా నీరుగారుతోంది.
నీరుగారుతున్న ఆరోగ్య కార్యక్రమాలు
జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రధానంగా పల్లె వైద్యం, గర్భిణులు, చిన్న పిల్లలు, తల్లులు, సంక్రమిత, అసంక్రమిత వ్యాధులు తదితర వాటికి కట్టడికి రూ. కోట్లల్లో వ్యయం చేస్తోంది. అంటు వ్యాధులు, క్యాన్సర్, ఇతర భయానకమైన వ్యాధులపై అవగాహన కల్పించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. అయితే అవన్నీ వృథా అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాలు మూలనపడ్డాయి. అవగాహన కార్యక్రమాలను కేంద్రానికే పరిమితం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం లేదు. అసలు దీనిపై జిల్లా అధికారులకు సైతం అవగాహన లేకపోవడం గమనార్హం. ఇక పర్యవేక్షణ పూర్తిగా కొరవడుతోంది. అధికారులు కార్యాలయాలకు పరిమితమవుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి కార్యాలయానికి రావడానికే సగం సమయాన్ని వెచ్చిస్తున్నారు. తద్వారా ఆరోగ్య కేంద్రాలపై పర్యవేక్షణ ప్రక్రియ పక్కదారి పట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
పర్యటనలకు దూరం
ప్రోగ్రాం ఆఫీసర్లను క్షేత్రస్థాయిలో పర్యటించకుండా...కార్యాలయంలోనే కూర్చోబెడుతున్నారని, ఇప్పటికై నా వారికి పర్యటన ఫవర్ ఇప్పించేలా చూడాలని శాఖలోని అధికార వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. కార్యాలయంలో ఏక్ నిరంజన్ పాలనపై కొందరు అధికారులు కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఏన్‌హెచ్‌ఎం నిధుల జమ, వ్యయం, దారి మళ్లింపు, తప్పుడు బిల్లుల సమర్పణపై రాత పూర్వకంగా ఫిర్యాదు చేయనున్నారని విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత అయినా పల్లె వైద్యంలో మార్పు వస్తుందో లేదో చూడాల్సి ఉంది.
మొక్కుబడిగా విధులు
క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంలదే కీలక బాధ్యత. వీరు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ...ప్రజారోగ్య సమస్యలను తెలుసుకోవాలి. సీజనల్ వ్యాధుల కట్టడి, గర్భస్థ వైద్య సేవల పనితీరు, పిల్లల ఆరోగ్యం తదితర అంశాలపై ఎప్పటికప్పుడు ఓ కంట పెడుతూ...సేవలను సక్రమంగా నిర్వర్తించాల్సిన బాధ్యత ఏఎన్‌ఎంలపై ఉంది. అయితే చాలా మంది ఏఎన్‌ఎంలు విధులను పూర్తిగా విస్మరిస్తున్నారు. జనాల్లోకి అలా..వెళ్లి ఇలా వచ్చేస్తున్నారు. స్థానికంగా ఉండడం లేదు. లేదంటే మీటింగ్‌ల పేరుతో విధులకు డుమ్మా కొట్టేస్తున్నారు. సర్వేలు, ఇతర సేవలు, కార్యక్రమాలను ఆశా వర్కర్లకు అప్పజెప్పుతున్నారు. ఆశాలపై వారిపని చూసుకుంటూ...ఏఎన్‌ఎంల పనిభారాన్ని సైతం మోస్తున్నారు. దీనిపై ఆశాల యూనియన్లు పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన అదనపు భారానికి బ్రేకులు వేయలేకపోతున్నారు.
పీహెచ్‌సీల మాదిరిగానే విలేజ్ హెల్త్ క్లినిక్‌లు కూడా తయారయ్యాయి. ఉదయం 9గంటలకు తెరుచుకోవాల్సిన క్లినిక్‌లు 10 గంటలు దాటుతున్నా తెరుచుకోని పరిస్థితి ఏర్పడింది. చాలా మంది సిబ్బంది భోజన విరామం తర్వాత కనిపించకుండా మాయమవుతున్నా రు. ఆపై ఆశా వర్కర్లను చూసుకోమని చెప్పి వెళ్లిపోతున్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను, సర్వేలను ఇంటి నుంచే చేస్తున్నారు. కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారు.


