వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ సుప్రజ, వెనుక ముసుగులో ఉన్న నిందితులు
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్) : బాలికను వ్యభిచార కూపంలోకి దించిన కేసులో పోలీసులు మరో పది మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం అడిషనల్ ఎస్పీ సుప్రజ, అరండల్‌పేట సీఐ రామానాయక్, పీసీఆర్ సీఐ టీవీ రత్నస్వామి మీడియాకు వివరాలు వెల్లడించారు. మేడికొండూరుకు చెందిన బాలికను వ్యభిచార కూపంలో దించిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో 80 మందిని గుర్తించగా, ఇప్పటి వరకు 74 మందిని అరెస్ట్ చేశారు.
మిగతా ఆరుగురిలో వ్యభిచార కేంద్రం నిర్వాహకురాలు మనస్విని అరెస్ట్ చేయాల్సి ఉందని, మరో వ్యక్తి లండన్‌లో ఉండటంతో ఇప్పటికే నోటీసులిచ్చినట్టు పోలీసులు తెలిపారు. విజయవాడకు చెందిన జెస్సింత మహిళా మిత్రగా చెప్పుకుంటూ.. నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలను గుర్తించి వ్యభిచార కూపంలోకి దించుతోందని పోలీసులు చెప్పారు.
మైనర్‌తో వ్యభిచారం చేయించిన జెస్సింత, ఆమె కుమార్తె హేమలతలు గతంలో జైలుకు వెళ్లారని, జైలు నుంచి బయటకొచ్చాక.. పలువురు విటులకు ఫోన్‌లు చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వకుంటే మీ పేర్లు కూడా పోలీసులకు చెబుతామంటూ బెదిరిస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందని పోలీసులు చెప్పారు. దీనిపై కూడా కేసు నమోదు చేస్తామన్నారు. అలాగే హేమలత పలువురు మగవాళ్లను మోసం చేసి డబ్బులు గుంజుకున్న ఘటనలూ వెలుగులోకి వచ్చాయన్నారు. పరారీలో ఉన్న మిగతా ఆరుగురిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment