
భోపాల్: వృద్ధుని చేతిలో అత్యాచారానికి గురైన బాలిక నిద్రమాత్రలు మింగి చనిపోయింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్యారేమియా(68)అనే వ్యక్తి స్థానికంగా వార్తా పత్రిక నిర్వహిస్తున్నాడు. ఇతడు తన వద్ద పనిచేసే ఐదుగురు బాలికలపై పలు పర్యాయాలు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు గత ఏడాది జూలైలో కేసు నమోదయింది. ఇతని బారిన పడిన బాలికలందరికీ స్థానిక షెల్టర్ హోంలో ఆశ్రయం కల్పించారు. బాధితుల్లో ఇద్దరు సోమవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి తరలించారు.
అందులో ఒక బాలిక (17) మోతాదుకు మించి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిందని అనుమానిస్తున్నారు. పరిస్థితి విషమించి ఆమె బుధవారం రాత్రి కన్నుమూసిందని అధికారులు వెల్లడించారు. ఘటనపై అధికారులు మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. నిందితుడైన ప్యారేమియాను జమ్మూకశ్మీర్‌లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. అతడికి సహకరించిన స్వీటీ విశ్వకర్మ(21)పై కేసు నమోదు చేశారు. గత ఏడాది జూలైలో అతని నివాసంలో జరిపిన సోదాల్లో ఖరీదైన కార్లు, మద్యం బాటిళ్లు, వన్యప్రాణుల ఎముకలు, పోర్న్ సీడీలు తదితరాలు లభించాయి. ప్యారే మియాపై ఐపీసీ, పోక్సో, అట్రాసిటీ, ఎక్సైజ్, వైల్డ్ లైఫ్ చట్టాల కింద కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment