తల్లిదండ్రులతో యువన్(ఫైల్)
సాక్షి, హైదరాబాద్: అదృశ్యమైన బాలుడు కొన్ని గంటల్లో శవమై తేలిన ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ జగదీశ్వర్‌రావు వివరాల ప్రకారం..లాల్‌వాణినగర్‌కు చెందిన యాతం మహేష్‌యాదవ్ కుమారుడు యువన్ (9) చిన్నప్పటి నుంచి మాటలు రాదు. ఈ నెల 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తల్లితండ్రులు గుడికి వెళ్లి వచ్చేసరికి యువన్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అర్ధరాత్రి వరకు గాలించినా ఫలితం లేకపోయింది.
సీసీ కెమెరాలు పరిశీలిస్తే..
ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లు రికార్డయింది. లాల్‌వాణీనగర్ ప్రధాన రహదారి మరో వైపు ఉన్న సీసీ కెమరా రికార్డులు పరిశీలిస్తే యువన్ అటు వైపు వచ్చినట్లుగా కనిపించలేదు. అనుమానం వచ్చిన పోలీసులు బండచెరువులో ప్రమాదవశాత్తు పడిపోయాడా అన్న కోణంలో వెతకడం ప్రారంభించారు. గుర్రపు డెక్కతీసే యంత్రం పై నుంచి గాలిస్తుండగా చెరువు చివర కాలిన శవాన్ని గుర్తించారు. ఒంటి మీద ఉన్న బట్టలు ఆదారంగా యువన్‌దే మృతదేహంగా నిర్ధారించారు.
అనుమానాలెన్నో..
బండచెరువులో చెత్త వేయకుండా కంచె ఏర్పాటు చేశారు. యువన్ మృతదేహం దొరికిన ప్రాంతంలో కంచె తొలగించి ఉంది. దీనిపై ఆరా తీయగా చెరువులో పందులు పెంచుకునే వారు వాటికి ఆహారం వేయడానికి కంచె తొలగించారని పారిశుద్ధ్య సిబ్బంది చెబుతున్నారు. ఘటనా జరిగిన స్థలానికి ప్రధాన రహదారి కొద్దిదూరంలోనే ఉంది. కాలిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది.గస్తీ సిబ్బంది అప్రమత్తంగా ఉండివుంటే ఈ సంఘటనను గుర్తించి ఉండేవారని స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ కొడుకు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపించారు. ఘటనా స్థలాన్ని డీసీపీ రక్షితామూర్తి, ఏసీపీ నర్సింహారెడ్డి పరిశీలించారు. జాగిలం కూడా అక్కడక్కడే తిరిగింది.
Comments
Please login to add a commentAdd a comment