ముంబై: ముంబై శివారు మలాడ్(పశ్చిమ)లో 6 వేల కిలోల బరువైన ఇనుప వంతెనను మాయం చేసిన ఘటనలో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. భారీ విద్యుత్ కేబుళ్లను అటూఇటూ జరిపేందుకు అదానీ ఎలక్ట్రిసిటీ సంస్థ 90 అడుగుల పొడవైన ఇనుప వంతెనను ఏర్పాటు చేసింది. అక్కడే శాశ్వత వంతెనను నిర్మించడంతో ఇనుప బ్రిడ్జిని గత కొన్ని నెలల క్రితం మరో ప్రాంతంలోని మురుగు కాల్వపైకి తరలించారు. ఈ వంతెన కనిపించకుండా పోయిందంటూ అదానీ సంస్థ జూన్ 26న బంగుర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
జూన్ 6వ తేదీ నుంచే ఆ బ్రిడ్జి మాయమైనట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ ప్రాంతంలో సీసీటీ కెమెరాలు లేవు. సమీప ప్రాంతాల్లోని నిఘా కెమెరాల ఫుటేజీని పరిశీలించగా జూన్ 11వ తేదీన వంతెన వైపుగా ఒక భారీ లారీ వచ్చిన విషయం రికార్డయింది. ఆ లారీ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా కూపీ లాగారు. అందులోనే గ్యాస్ కటింగ్ యంత్రాలను తీసుకువచ్చి 6 టన్నుల ఇనుప వంతెనను కట్ చేసి ఎత్తుకుపోయినట్లు గుర్తించారు. ఆ బ్రిడ్జిని నిర్మించిన కాంట్రాక్టు సంస్థ ఉద్యోగే సూత్రధారి అని తేలడంతో అతడిని, సహకరించిన మరో ముగ్గురిని గత వారం అదుపులోకి తీసుకున్నారు. ఎత్తుకుపోయిన ఇనుప సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment