మోడల్ స్కూల్ గేట్ చేపట్టిన క్షుద్రపూజలు, క్షుద్రపూజల సామగ్రిని తొలగిస్తున్న కార్మికుడు
జైనథ్( ఆదిలాబాద్): మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ గేటు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి క్షుద్రపూజలు నిర్వహించడం కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి మోడల్ స్కూల్ గేటు ఎదుట మట్టి బొమ్మలకు పసుపు పూసి, నిమ్మకాయలు, గుడ్లు పెట్టి పూజలు చేశారు. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో విద్యార్ధులు కొంతమంది పాఠశాలకు రావడంతో క్షుద్ర పూజలు చేసిన స్థలాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు.
ఇది గమనించిన విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ తహశీల్దార్ రాఘవేంద్రరావుకు ఫోన్లో సమాచారం అందించి సంఘటనా స్థలాన్ని పరిశీలించాలని ఆదేశించారు. సంఘటన స్థలానికి చేరుకున్న తహశీల్దార్ క్షుద్రపూజల సామగ్రిని అక్కడి నుంచి తొలగింపజేసి వాటిని కాల్చి వేయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పెర్సిస్ బిట్ల తెలిపారు.
సోమవారం అవగాహన సదస్సు..
క్షుద్రపూజల వంటి మూఢనమ్మకాలను నమ్మరాదని తహసీల్దార్ రాఘవేంద్రరావు గ్రామస్తులకు తెలిపారు. ఈ మేరకు విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. సోమవారం పాఠశాలలో మూఢనమ్మకాలపై ఉన్న అపోహలు తొలగించేందుకు అవగాహన సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరు కావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment