అంబానీ ఇంటి వద్ద కలకలం : సంచలన ఆధారాలు | Ambani  bomb threat case Key Recoveries From A Mercedes | Sakshi
Sakshi News home page

అంబానీ ఇంటి వద్ద కలకలం : సంచలన ఆధారాలు

Published Wed, Mar 17 2021 1:56 PM | Last Updated on Thu, Mar 18 2021 3:44 PM

Ambani  bomb threat case Key Recoveries From A Mercedes - Sakshi

సాక్షి, ముంబై: బిలియనీర్‌, రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ ఇంటిముందు పేలుడు పదార్థాల వాహనం కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ వాహన యజమాని థానేకు చెందిన ఆటో విడిభాగాల డీలర్ మన్సుఖ్ హిరేన్‌ అనుమానాస్పదమరణంతో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ పలు కీలక విషయాలను వెల్లడించింది.  దీంతో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌, ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్  యూనిట్ మాజీ అధికారి  సచిన్‌ వాజే చుట్టూ ఉచ్చు  బిగుస్తోంది.  (అంబానీ ఇంటి వద్ద కలకలం: మరో కీలక ట్విస్టు)

సచిన్ వాజే వాడుతున్న బ్లాక్ మెర్సిడెస్ బెంజ్ కారును ఎన్‌ఐఏ తాజాగా స్వాధీనం చేసుకుంది. ఇందులో 5లక్షల నగదు,  నోట్ల  లెక్కింపు మెషీన్‌, కొన్ని దుస్తులతోపాటు కీలక ఆధారాలను  సీజ్‌ చేసింది.   వాజే నడుపుతున్నాడని ఆరోపిస్తున్న ఈ  బెంజ్‌కారులో అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన స్కార్పియో వాహనం  లైసెన్స్ ప్లేట్‌ను కూడా  సీజ్‌ చేయడం గమనార్హం.  ఈ కేసులో ఇప్పటికే సచిన్‌వాజేను అరెస్ట్‌ చేసిన ఎన్ఐఏ అధికారులు ముంబైలోని క్రైమ్ ఇంటలిజెన్స్ యూనిట్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒక ల్యాప్‌టాప్, ఐప్యాడ్, ఫోన్, డిజిటల్ వీడియో రికార్డర్‌తో పాటు థానేలోని సచిన్ వాజే నివాసానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. మొబైల్‌ ఫోన్‌ను కూడా కావాలని పారేసిన వాజే ల్యాప్‌టాప్‌లోని డేటాతోపాటు, సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా డిలీట్‌ చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. అలాగే సీసీటీవీలో పీపీఈ కిట్‌ ధరించిన వ్యక్తి వాజేనేనని ఎన్ఐఏ స్పష్టం చేసింది.  చెక్ షర్ట్, కిరోసిన్ ఉన్న ప్లాస్టిక్ బాటిల్ కూడా దొరికినట్లు అధికారులు తెలిపారు. ఈ కిరోసిన్‌తోనే పీపీఈ కిట్‌ తగుల బెట్టాడని ఆరోపిస్తోంది. ప్రస్తుతం సచిన్ వాజే వినియోగిస్తున్న బెంజ్‌ కారు అసలు యజమాని ఎవరు  అన్నదానిపై ఆరా తీస్తున్నామని ఎన్‌ఐఏ అధికారి అనిల్‌ శుక్లా తెలిపారు. (అంబానీ ఇంటి వద్ద కలకలం : మరో కీలక పరిణామం)

కాగా ఫిబ్రవరి 25న ముంబైలోని అంబానీ నివాసం అంటిల్లాకు సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన స్కార్పియో వాహనం కలకలం రేపింది. తన స్కార్పియో  కనిపించడం లేదంటూ మన్సుఖ్‌ హిరేన్‌ ఫిబ్రవరి 17నే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మార్చి 5 న ముంబైకి సమీపంలోని కొలనులో హిరేన్‌ శవమై తేలాడు. దీంతో హిరేన్‌ భార్య విమల సచిన్‌వాజేపై ఫిర్యాదు చేసింది. మరోవైపు శివసేన ప్రభుత్వం వాజేను రక్షించేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై  మహారాష్ట్ర  మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ వాజేపై  మొదటినుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ట్విస్ట్స్‌ అండ్‌ టర్న్స్‌తో  ఉత్కంఠను రేకెత్తిస్తున్న ఈ కేసు చివరకు ఎలా ముగుస్తుందో వేచి చూడాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement