అనికా (ఫైల్)
బెంగళూరు : గుట్టుచప్పుడు కాకుండా స్మగ్లర్ల నుంచి మత్తు పదార్థాలను కొనుగోలు చేస్తున్న శాండల్‌వుడ్‌కు చెందిన నటులు, సంగీత కళాకారుల పేర్లను డ్రగ్స్ డీలర్ అనికా ఎన్‌సిబీ అధికారులకు వెల్లడించినట్లు తెలిసింది. డ్రగ్స్‌కు కోడ్ పేర్లను పెట్టి తాను సరఫరా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. తన నుంచి ఏయే నటీ నటులు డ్రగ్స్‌ను కొనేదీ వివరించారు. సుమారు 30 మంది వరకు సినిమా రంగానికి చెందిన వ్యక్తుల పేర్లను ఎన్‌సీబీ అధికారులకు వెల్లడించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి సాక్ష్యాధారాలను సేకరించిన ఎన్‌సీబీ అధికారులు వారికి నోటీసులను అందించాలని నిర్ణయించారు.
ఎవరీ అనికా?
నిందితురాలు పేరు అనికా అయితే అనికా డి, బిమని అనే రెండు మూడు పేర్లను పెట్టుకొని బెంగళూరులో మత్తు దందాను నడపుతున్నట్లు విచారణలో బయట పడింది. సోషల్ మీడియాలో బిమని అనే పేరుతో చలామణి అయ్యేది. ఆమె తమిళనాడు సేలంకు చెందినవారు కాగా ఆమెకు ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉన్నాడు. తమిళనాడులో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సును మధ్యలో వదిలేసింది. ఉద్యోగం కోసం బెంగళూరుకు వచ్చింది. ఉద్యోగం దొరక్క, డ్రగ్స్ వ్యాపారంలోకి దిగినట్లు విచారణలో వివరించింది. ముంబై డ్రగ్స్ డీలర్లు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆమె ఇంటిపై దాడి చేసి పెద్దమొత్తంలో మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టినప్పుడు సినిమా రంగ ప్రముఖుల బండారం బయటపడింది. ( ఆ సినీ ప్రముఖుల పేర్లు బయటపెడతా...)
లంకేశ్ విచారణ ద్వారా 15 మందికి తాఖీదులు?
డ్రగ్స్ దందాపై సోమవారం దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ ఇచ్చిన సమాచారం మేరకు సినిమా రంగానికి చెందిన మరో 15 మందికి నోటీసులు ఇవ్వనున్నారు. సినీ రంగంలో డ్రగ్స్ తీసుకొనేవారి పేర్లను లంకేశ్ సీసీబీ పోలీసులకు అందజేశారు. బెంగళూరులో పోలీసు ఉన్నతాధికారులు సమావేశమై డ్రగ్స్ విషయంపై చర్చించారు. ఈ 15 మంది సినీ ప్రముఖులు ఎవరనేది ఇప్పుడు శాండల్‌వుడ్‌లో పెద్ద చర్చ జరుగుతోంది.
కరోనా వచ్చాక నేరాల వృద్ధి: కమిషనర్
డ్రగ్స్ వ్యవహారం అధికంగా నడుస్తున్న ఉప్పారపేట, బసవేశ్వరనగర, చంద్రాలేఔట్ ప్రాంతాల పోలీసుస్టేషన్లను నగరపోలీస్ కమిషనర్ కమల్‌పంథ్ మంగళవారం తనిఖీ చేశారు. డ్రగ్స్‌పై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. కరోనా వచ్చిన తరువాత బెంగళూరు నగరంలో నేరాల సంఖ్య పెరిగినట్లు ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment