సాక్షి బెంగళూరు: డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు కన్నడ సినీ పరిశ్రమను కుదిపేస్తున్నాయి. పోలీసుల విచారణలో శాండల్‌వుడ్ నటీనటులు, దర్శకులు, నిర్మాతల పేర్లు ఒక్కటొక్కటిగా బయటకు వస్తుండటంతో సినీ వర్గాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఈ కేసులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల (సీసీబీ) శుక్రవారం ఒక అడుగు ముందుకు వేసింది. యలహంకలో ఉన్న హీరోయిన్ రాగిణి ద్వివేది ఇంటిపై శుక్రవారం తెల్లవారుజామున దాడి చేసింది.
రెండు రోజుల క్రితమే నటి రాగిణి సన్నిహితుడు రవిశంకర్‌ను సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. రవి శంకర్ ఇచ్చిన సమాచారంతో రాగిణిని గురువారం విచారణకు రావాలని నోటీసులిచ్చారు. తనకు ఆరోగ్యం సరిగా లేదని, సోమవారం విచారణకు వస్తానని లాయర్ ద్వారా రాగిణి సమాధానం పంపారు. ఈ నేపథ్యంలో కోర్టు ద్వారా సెర్చ్‌వారంట్‌తో పోలీసులు శుక్రవారం ఉదయం 6.30 గంటలకు ఆమె ఇంటిపై దాడి చేసి, సోదాలు జరిపారు.
అనంతరం రాగిణిని విచారణ నిమిత్తం సీసీబీ కార్యాలయానికి తీసుకెళ్లారు. కాగా, శుక్రవారం సాయంత్రం రాగిణిని అరెస్టు చేసినట్లు సీసీబీ ప్రకటించింది. రాగిణి పెట్టుకున్న ముందస్తు బెయిల్‌పై విచారణను 7వ తేదీకి ఎన్‌డీపీఎస్ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఇటీవల ముగ్గురు డ్రగ్స్ పెడ్లర్స్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అరెస్టు చేసింది. వీరు వెల్లడించిన సమాచారంతో దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్‌ను సీసీబీ పోలీసులు విచారించగా ఈ డ్రగ్స్ వ్యవహారంలో సుమారు 15 మంది సినీ ప్రముఖులు ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment