సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర, ముఖ్యమంత్రిని అవమానించేలా, కులాలను కించపరిచేలా, సమాజంలో అశాంతిని రేకెత్తించేలా వ్యాఖ్యలు చేసిన కేసులో నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును ఈ నెల 17న విచారణకు రావాలంటూ ఏపీ సీఐడీ నోటీసు జారీ చేసింది. బుధవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్‌హిల్స్‌లో విల్లా నంబర్ 74లో ఉన్న రఘురామ ఇంటికి సీఐడీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ బృందం ఉదయం 9 గంటలకు వెళ్లింది. తొలుత సీఐడీ బృందాన్ని ఇంట్లోకి అనుమతించలేదు. రఘురామకృష్ణరాజు న్యాయవాది వచ్చిన అనంతరం ముగ్గురిని అనుమతించారు. క్రైమ్ నంబర్ 12/2021, సెక్షన్ 153, 505, 124–ఎ రెడ్ విత్ 120బి కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ ఆయనను విచారణకు పిలిచింది.
17న మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు రీజినల్ సీఐడీ కార్యాలయానికి వచ్చి విచారణకు సహకరించాలని ఆ నోటీసులో పేర్కొంది. ఈ కేసులో గతంలో అరెస్టైన రఘురామకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దర్యాప్తునకు సహకరించాలని, మీడియా సమావేశాలు నిర్వహించకూడదని, ప్రభుత్వాన్ని, వ్యక్తులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయకూడదనే షరతులు ఉన్నాయి. కేసు దర్యాప్తు అధికారి, సీఐడీ ఏఎస్పీ విజయపాల్ ఇటీవల రిటైరయ్యారు. దీంతో దర్యాప్తు బాధ్యతలను డీఎస్పీ జయసూర్యకు సీఐడీ అప్పగించింది. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు కోసం రఘురామను విచారించేందుకు సీఐడీ సిద్ధమైంది. కోర్టు ఆదేశాల ప్రకారమే వ్యవహరిస్తున్నామని, నోటీసు అందులో భాగమేనని సీఐడీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఇదిలా ఉంటే సీఐడీ నోటీసు ఇచ్చిన కొద్దిసేపటికే రఘురామ ఇంటికి అమరావతి జేఏసీ కీలక నేత వెళ్లి మాట్లాడటం గమనార్హం.
మరిన్ని వివరాల కోసం నోటీసు ఇచ్చారు: రఘురామకృష్ణరాజు
ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించానంటూ గతంలో నమోదు చేసిన కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు విచారణకు రావాలంటూ సీఐడీ అధికారులు నోటీసు ఇచ్చారని ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పారు. సీఐడీ నోటీసులు ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చట్టాలను, న్యాయస్థానాలను గౌరవిస్తానని అన్నారు. ముఖ్యమైన సంక్రాంతి పండగకు వస్తున్నానని తెలిసే ఇప్పుడు నోటీసులు ఇచ్చారా అని ప్రశ్నించారు. రేపు నరసాపురానికి వస్తున్నానని అక్కడి కలెక్టర్, ఎస్పీకి ముందుగానే తెలిపానన్నారు. కరోనా ప్రొటోకాల్స్‌కు అనుగుణంగా విచారణకు హాజరవుతానని అన్నారు. గతంలో తనను హింసించిన సమయంలో కెమెరాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. తనను హింసించిన వీడియోలు చూసి ఎవరు ఆనందపడ్డారో తనకు తెలుసన్నారు. ఎస్సీలపైనా ఎస్సీ కేసులు పెట్టడం చూస్తున్నామని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment