సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ పబ్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. నిబంధనలకు విరుద్ధంగా పబ్ పార్టీకి మైనర్లను యాజమాన్యం అనుమతించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో అభిషేక్, అనిల్‌ను అరెస్ట్ చేయగా.. అర్జున్, కిరణ్‌రాజ్ పరారీలో ఉన్నారు. ఈ కేసులో ఏ1 అనిల్, ఏ2 అభిషేక్, ఏ3గా ఎన్టీఆర్ కూతురి అల్లుడు అర్జున్ వీరమాచినేని, మాజీ ఎంపీ రేణుకాచౌదరి అల్లుడు కిరణ్‌రాజ్‌ను ఏ4 నిందితుడిగా పోలీసులు చేర్చారు. 2017-20 వరకు తన భార్యతో కలిసి కిరణ్‌రాజ్ పబ్ నడిపాడు. 2020 ఆగష్టులో అభిషేక్, అనిల్‌కు లీజు ఇచ్చిన కిరణ్‌రాజ్.. పార్ట్‌నర్‌గా కొనసాగుతున్నట్లు సమాచారం.
చదవండి: పబ్‌లో యథేచ్ఛగా మత్తు దందా... డ్రగ్ మారో డ్రగ్
డ్రగ్స్ సరఫరాపై పూర్తి నిఘా..
హైదరాబాద్ డ్రగ్స్ సరఫరాపై పూర్తి నిఘా ఉందని నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ చీఫ్ చక్రవర్తి తెలిపారు. డ్రగ్స్ వినియోగించే స్పాట్స్‌పై సమాచారం ఉందన్నారు. పబ్బులు, క్లబ్‌లు, రెస్టారెంట్, రిసార్ట్స్‌పై పూర్తి నిఘా ఉంచామన్నారు. గోవా నుంచి డ్రగ్స్ రవాణా అవుతున్నట్లు గుర్తించామన్నారు. డార్క్ నెట్ ద్వారా విదేశాల నుంచి డగ్ర్స్ రవాణా అవుతుందన్నారు. డార్క్ నెట్ ఢీకోడ్ చేసే టెక్నాలజీ తమ వద్ద ఉందన్నారు. డక్స్ ఫెడ్లర్స్, కంజూమర్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలని తల్లిదండ్రులకు ఆయన సూచించారు.
నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్
బంజారాహిల్స్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రగ్స్ కేసు నిందితులను ఐదు రోజుల కస్టడీ కోరతూ నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
రాడిసన్ హోటల్ లైసెన్స్ రద్దు
రాడిసన్ హోటల్ లైసెన్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. పబ్, లిక్కర్ లైసెన్స్‌లను రద్దు చేస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 24 గంటలపాటు లిక్కర్ సప్లైకి రాడిసన్ హోటల్ అనుమతి తీసుకుంది. జనవరి 7న లిక్కర్ లైసెన్స్‌కి అనుమతి తీసుకోగా, రూ. 56 లక్షల బార్ ట్యాక్స్ చెల్లించి లైసెన్స్ పొందింది. 2బీ బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో అనుమతి తీసుకుంది. పబ్‌లో డ్రగ్స్ బయటపడటంతో లైసెన్స్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నం.6లో ఉన్న ర్యాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌కు చెందిన ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో ఆదివారం తెల్లవారుజామున నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని.. పబ్ సిబ్బంది సహా 148 మందిని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇందులో 90 మంది యువకులు, 38 మంది యువతులు, 18 మంది స్టాఫ్, ఇద్దరు నిర్వాహకులు ఉన్నారు.
చదవండి: పబ్‌లతో తారల బంధం!
వీరిలో తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా సిద్ధార్థ్, సినీనటుడు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల, బిగ్‌బాస్ విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తదితరులు ఉన్నారు. పబ్బులో డ్రగ్స్ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్.. బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ పూసపాటి శివచంద్రను సస్పెండ్ చేశారు, ఆ ఏరియా ఏసీపీ మంత్రి సుదర్శన్‌కు చార్జ్‌మెమో జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment