వివరాలు వెల్లడిస్తున్న అడిషనల్ ఎస్పీ మహేష్
కలికిరి: చిత్తూరు జిల్లా కలికిరి బ్యాంక్ ఆఫ్ బరోడాలో చోటుచేసుకున్న నగదు అక్రమాల కేసులో గురువారం పోలీసులు 16 మందిని అరెస్టు చేశారు. వీరిలో 11 మంది బీవోబీ ఉద్యోగులు, మెసెంజరు సయ్యద్ అలీఖాన్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు ఐదుగురున్నారు. జిల్లా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) మహేష్ మీడియాకు వివరాలు వెల్లడించారు. బీవోబీలో స్వయం సహాయక సంఘాల నిధులు దుర్వినియోగమయ్యాయని సంఘమిత్ర ప్రసన్నలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీంతో బ్యాంక్ అధికారులు, సిబ్బంది ప్రమేయంతో మెసెంజరు రూ.1.6కోట్ల (ఎస్‌హెచ్‌జీ) నిధులను పక్కదారి పట్టించినట్లు విచారణలో వెల్లడైంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్లు కొల్లగొట్టడం, నకిలీ పత్రాలు, పాస్‌వర్డ్‌లు వినియోగించి అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. అక్రమాలకు పాల్పడ్డారని తేలిన 16 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.20లక్షలు, మెసెంజరు అలీఖాన్‌కు చెందిన రూ.48.16లక్షలు విలువ చేసే 1.12 కిలోల తాకట్టు బంగారు నగల పత్రాలు, ఎనిమిది ఖాతాలను ఫ్రీజ్ చేసి, మూడు ద్విచక్రవాహనాలు, 12 సెల్‌ఫోన్‌లు మొత్తం రూ.70.20లక్షల విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను వాల్మీకిపురం కోర్టులో హాజరుపరిచారు. కాగా మదనపల్లి డీఎస్పీ రవిమనోహరాచారి ఆధ్వర్యంలో వాల్మీకిపురం సీఐ నాగార్జునరెడ్డి, కలికిరి ఎస్‌ఐ లోకేష్ రెడ్డి కేసు దర్యాప్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment