బెంగళూరు: ఎంబీఏ పూర్తి చేశాడు. మంచి ప్యాకేజితో ఉద్యోగం ఇవ్వడానికి కంపెనీలు ముందుకు వచ్చాయి. కానీ అతడి దృష్టి మాత్రం కలెక్టర్ జాబ్ మీదనే. ఐఏఎస్ సాధించి ప్రజలకు సేవ చేయాలని భావించాడు. దీక్షగా చదవడం ప్రారంభించాడు. ఇలానే మరికొంత కాలం చదువు కొనసాగిస్తే.. అతడి కల సాకారమయ్యేది. కానీ ఫేస్‌బుక్ అతడి జీవితాన్ని, కలని చిదిమేసింది. ఓ యువతి పేరుతో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ అతడి జీవితానికి ఎండ్ కార్డ్ వేసింది. ‘ఆమె’ మాయలో పడి నగ్నంగా వీడియో కాల్ మాట్లాడాడు. దాన్ని రికార్డు చేసిన సైబర్ నేరగాళ్లు డబ్బుల కోసం అతడిని బెదిరించడం ప్రారంభించారు. అప్పటికే బాధితుడు వారికి కొంత డబ్బు ఇచ్చాడు. కానీ వేధింపులు ఆగకపోవడంతో.. ధైర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని ముగించాడు. అతడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీరని గర్భశోకం మిగిల్చాడు. ఆ వివరాలు..
బాధితుడు భట్టరహళ్లి సమీపంలోని కేఆర్ పురంలో నివాసం ఉంటున్నాడు. ఎంబీఏ పూర్తి చేసి.. ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలో రెండు వారాల క్రితం అతడు తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో కుటుంబ సభ్యులకు అర్థం కాలేదు. ఎలాంటి సూసైడ్ నోట్ కూడా లభించలేదు. అయితే బాధితుడి ఫేస్‌బుక్‌కి వచ్చిన సందేశాలను బట్టి అతడి సోదరి.. సైబర్ నేరగాళ్ల బెదిరింపులు తట్టుకోలేకనే తన సోదరుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని గ్రహించింది. అసలు సైబర్ సైకోగాళ్లు తన అన్నను ఏ విషయంలో బెదిరిస్తున్నారో తెలుసుకోవాలనుకుంది. ఈ నేపథ్యంలో బాధితుడు మరణించిన రెండు రోజుల తర్వాత నేహా శర్మ అనే అకౌంట్ నుంచి ‘‘నీ ఫోన్ నంబర్ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుంది’’ అంటూ హెచ్చరిస్తూ ఓ సందేశం వచ్చింది.
దాంతో బాధితుడి సోదరి సైబర్ నేరగాళ్లకు తన బంధువు నంబర్ సెండ్ చేసింది. ఆ తర్వాత తేజాస్ మరేష్ భాయ్ అనే వ్యక్తి నుంచి తన బంధువు నంబర్‌కి మెసేజ్ వచ్చింది. తేజాస్ తమకు డబ్బులు ఇవ్వాలని బెదిరించడం ప్రారంభించాడు. దాంతో మృతుడి సోదరి దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొద్ది రోజుల క్రితం బాధితుడికి నేహా శర్మ అనే ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. యాక్సెప్ట్ చేశాడు. మెసేజ్‌లతో ప్రారంభం అయిన వారి పరిచయం నగ్నంగా వీడియో కాల్ చేసుకునే వరకు వెళ్లింది.
ఈ క్రమంలో ఓ రోజు యువతి బాధితుడికి కాల్ చేసి.. తన దుస్తులు తొలగించి పూర్తి నగ్నంగా మారింది. ఆ తర్వాత అతడిని కూడా దుస్తులు తొలగించాల్సిందిగా కోరింది. ఆమె కోరిక మేరకు బాధితుడు నగ్నంగా మారి ఫోన్ మాట్లాడటం ప్రారంభించాడు. దాంతో సైబర్ నేరగాళ్లు బాధితుడి వీడియో రికార్డ్ చేశారు. ఆ తర్వాత అతడికి ఫేస్‌బుక్ ద్వారా ఈ నగ్న వీడియో పంపారు. తాము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే.. ఈ వీడియోని అతడి స్నేహితులకు సెండ్ చేస్తానని బెదిరించారు సైబర్ నేరగాళ్లు. దాంతో బాధితుడు తన ఫ్రెండ్స్ వద్ద అప్పు చేసి మరి 36 వేల రూపాయలు వారికి పంపించాడు. ఆ తర్వాత కూడా బెదిరింపులు ఆగకపోవడంతో.. బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
చదవండి:
నేను పక్కా పల్లెటూరి వాడిని: ఐఏఎస్
‘ఆమె’గా వల.. న్యూడ్ వీడియోలతో బ్లాక్‌మెయిల్
Comments
Please login to add a commentAdd a comment