ఏకే రావు (ఫైల్)
బనశంకరి: అనుమానాస్పదంగా మృతిచెందిన ప్రొఫెసర్ ఏకే రావు కేసులో కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. ఒక ముఠా చేసిన భారీ మోసమే ఆయన మృతికి కారణమని తెలుస్తోంది. దీనికి బలం చేకూరేలా ఏకే రావు చనిపోయే రోజు పోలీసుల విచారణ ఎదుర్కొన్నారని తేలింది. తెలుగు గాయని హరిణి తండ్రి, విశ్రాంత ప్రొఫెసర్ ఏకే రావు 23వ తేదీ బెంగళూర్‌లో యలహంక–రాజానుకుంటే రైల్వే పట్టాలపై శవమై కనిపించారు. చాకుతో గొంతు, ఎడమ చేతిని కోసిన గుర్తులు కనిపించాయి. ఇది హత్యేనని కుటుంబ సభ్యులు యశవంతపుర రైల్వే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పదవీ విరమణ తరువాత లోన్ కన్సల్టెన్సీ..
రావు మృతి చెందక ముందు కర్ణాటక సుద్దగుంటెపాళ్య పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆయన ఇటీవల పదవీవిరమణ పొందారు. తరువాత బెంగళూర్‌లో లోన్ కన్సల్టెన్సీ ఏజెన్సీని తెరిచారు. ఈ సమయంలో రావుకు, ఎస్ వెంచర్స్ కేపిటల్ ఫైనాన్స్ కంపెనీకి చెందిన డేనియల్ ఆర్మ్‌స్ట్రాంగ్, రాఘవన్, వివేకానంద అనే వ్యక్తులు పరిచయమయ్యారు. తాము భారీ ప్రాజెక్టులకు రుణాలు ఇప్పిస్తామని తెలిపారు.
దీంతో రావు తన లోన్ కన్సల్టెన్సీ ద్వారా రుణాలు అడిగిన అరుణాచలప్రదేశ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫణి తారంగ, బెంగళూర్ పారిశ్రామిక వేత్త గిరీశ్‌లను వారి వద్దకు పంపారు. లోన్లు ఇస్తామని, అయితే 3 నెలల ఈఎంఐ ముందుగా చెల్లించాలని ఆర్మ్‌స్ట్రాంగ్ బృందం చెప్పగా ఫణి తారంగ, గిరీశ్ సరేనన్నారు. రూ.240 కోట్ల లోన్‌కు ఫణి తారంగ రూ.3.60 కోట్లు, గిరీశ్ రూ.150 కోట్లకు రూ.3 కోట్లు ముందస్తుగా ఈఎంఐ చెల్లించారు.
ఆ తరువాత ఆర్మ్‌స్ట్రాంగ్ బృందం ఫోన్లు స్విచాఫ్ చేసుకుని పరారైంది. దీంతో ఫణి తారంగ, గిరీశ్‌లు రావును నిలదీయడంతో పాటు స్థానిక సుద్దగుంటపాళ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రావును విచారణకు పిలిపించి పంపించినట్లు సమాచారం. ఫైనాన్షియర్లు నమ్మించి మోసం చేశారని రావు స్నేహితుల వద్ద వాపోయారు. అనంతరం కొద్దిసేపటికి ఏకే రావు రైల్వేట్రాక్‌పై శవమై కనిపించారు. ఈ నేపథ్యంలో ఆర్మ్‌స్ట్రాంగ్, వివేకానంద, రాఘవన్ కోసం సుద్దగుంటెపాళ్య పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment