ముప్పాళ్ల(పల్నాడు జిల్లా): క్షణికావేశం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఆలనా పాలనా చూడాల్సిన తల్లి క్షణికావేశంతో ఆత్మహత్యకు ప్రయత్నించి కన్నబిడ్డకు అమ్మప్రేమను దూరం చేయగా, తన తోబుట్టువులా భావించే మనిషి కళ్ల ముందే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తే ఆమెను కాపాడే ప్రయత్నంలో మరో వ్యక్తి మృతి చెందిన విషాదకర సంఘటన పల్నాడు జిల్లాలో సోమవారం జరిగింది. రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది.
చదవండి: బీచ్‌లో రిప్ కరెంట్.. వేరీ డేంజర్.. గజ ఈతగాళ్లు కూడా తప్పించుకోలేరు..
కాలువలో దూకిన చెల్లి, ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన సోదరుడు ఇద్దరూ మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలోని నార్నెపాడు సమీపంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామానికి చెందిన శానంపూడి హరినాథ్‌రెడ్డికి నాలుగేళ్ల కిందట ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన కృష్ణవేణి(22)తో వివాహం జరిగింది. వారికి రెండున్నరేళ్ల బాబు ఉన్నాడు. ఏడాది కిందట ప్రమాదం జరిగి హరినాథ్‌రెడ్డికి కాలు విరిగింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.
15 రోజుల కిందట భర్తతో గొడవ పడి ఆమె పుట్టింటికి వెళ్లింది. హరినాథ్‌రెడ్డి వరుసకు బావ అయిన మోదుగుల వెంకటరమణారెడ్డి(47)ని తన భార్య, కుమారుడిని తీసుకురావాలని కోరారు. ఆ నేపథ్యంలో వెంకటరమణారెడ్డి ఏల్చూరు వెళ్లి ఆమె తల్లిదండ్రులు, బంధువులతో మాట్లాడాడు. కృష్ణవేణి, ఆమె కుమారుడు మహీందర్‌రెడ్డిని తీసుకుని తన ద్విచక్రవాహనంపై పాకాలపాడు బయలుదేరాడు. మండల పరిధిలోని నార్నెపాడు రోడ్డు వద్ద గల గుంటూరు బ్రాంచి కాలువ వద్దకు రాగానే ఆమె బైకు ఆపమని కోరింది. బైకు ఆపగా వెళ్లి కాలువలో దూకింది.
ఈ హఠాత్తు పరిణామంతో ఖంగుతిన్న వెంకటరమణారెడ్డి బండిపై బాలుడిని కూర్చోబెట్టి ఆమెను కాపాడేందుకు కాలువలో దూకాడు. అప్పటికే నీటి ప్రవాహంలో ఆమె మునిగి పోయింది. అక్కడే ఉన్న స్థానికులు వెంకటరమణారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో అతను మునిగిపోయాడు. అతని మృతదేహాన్ని బయటకు తీయగా, ఆమె మృతదేహం కనిపించలేదు. నీటి ఉధృతిని మరో కాలువకు మళ్లించి గాలింపు చేపట్టారు. కాసేపటికి మృతదేహం లభ్యమైంది. ఇరువురి మృతదేహాలను శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎం.పట్టాభిరామయ్య తెలిపారు.
అమ్మ కావాలి...
అమ్మ కావాలి అంటూ బాలుడు ఏడుస్తున్న తీరు చూపరులను కన్నీరు పెట్టించింది. అప్పటి వరకు తనతోపాటు వచ్చిన అమ్మ, మామయ్యలు కనిపించకపోవటంతో పాటు, జనాలు పెద్దఎత్తున గుమికూడి ఉండటంతో ఏమి జరిగిందో తెలియక బాలుడు విలపించసాగాడు. కొద్దిసేపటికి మృతుల బంధువులు అక్కడికి చేరుకుని బాలుడిని ఓదార్చారు. వెంకటరమణారెడ్డికి భార్య ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఈ సంఘటనతో రెండు కుటుంబాల్లోను విషాదఛాయలు అలముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment