వేటకొడవలితో నరికి దంపతుల దారుణహత్య
మనస్పర్థలతో వేరుపడిన ప్రేమజంట
అప్పటి నుంచి యువతి కుటుంబంపై కక్ష పెంచుకున్న యువకుడు
ఆమె తల్లిదండ్రులను హతమార్చిన వైనం
యువతికి, ఆమె సోదరుడికి తీవ్ర గాయాలు
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
చెన్నారావుపేట: ఓ ఉన్మాది చేతిలో భార్యాభర్తలు దారుణ హత్యకు గురయ్యారు. యువతి, ఆమె సోదరుడు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని పదహారుచింతల్‌తండా గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా.. తండాకు చెందిన భానోతు శ్రీనివాస్(40), సుగుణ(35) దంపతులకు కూతురు దీపిక, కుమారుడు మదన్‌లాల్ ఉన్నారు. వీరిది వ్యవసాయ కుటుంబం.
దీపిక డిగ్రీ సెకండియర్, కుమారుడు మదన్‌లాల్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. కాగా.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మేకల నాగరాజు(బన్ని)తో దీపిక ప్రేమలో పడింది. నాగరాజు తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వలస వెళ్లగా నాగరాజు గ్రామంలోనే ఉంటున్నాడు. గత నవంబర్‌లో నాగరాజు, దీపిక వెళ్లిపోయి కులాంతర వివాహం చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో జనవరిలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోవడమే కాకుండా.. చెన్నారావుపేట పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యా దులు చేసుకున్నారు. అనేక మార్లు పెద్ద మనుషుల మధ్య పంచాయితీ జరిగింది.
ఒకరి జోలికి ఒకరు వెళ్లకుండా ఉండాలని తీర్మానం చేశారు. అప్పటి నుంచి దీపిక కుటుంబంపై కక్ష పెంచుకున్న నాగరాజు.. బుధవారం అర్ధరాత్రి పదహారుచింతల్‌తండాకు చేరుకున్నాడు. ఆరు బయట నిద్రిస్తున్న దీపిక, ఆమె తల్లిదండ్రులు భానోతు శ్రీనివాస్, సుగుణపై వేట కొడవలితో దాడి చేశాడు. ఆ అలజడికి ఇంట్లో నిద్రిస్తున్న కుమారుడు మదన్‌లాల్ బయటికి రాగా అతడిపైనా దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన సుగుణ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు శ్రీనివాస్‌ను నర్సంపేట ప్రభు త్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. తీవ్రంగా గాయపడిన దీపిక, మదన్‌లాల్‌ను హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతున్నారు.
పోలీసుల అదుపులో నిందితుడు!
నిందితుడు నాగరాజు గుండెంగ ప్రభుత్వ పాఠశాల వరండాలో తెల్లవారు వరకు ఉన్నట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు అక్కడికి చేరుకున్నారు. అతడితోపాటు హత్యకు ఉపయోగించిన వేటకొడవలి, ఎక్సెల్ ద్విచక్ర వాహనాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితుడిని విచారిస్తున్నట్లు తెలిసింది. కాగా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నర్సంపేటలో పోలీస్‌స్టేషన్ వద్ద, వరంగల్ రోడ్డ జంక్షన్ వద్ద ఆందోళనకు దిగారు.
ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్ ఘటనస్థలానికి చేరుకుని వారితో మాట్లాడారు. ఫోన్‌లో కలెక్టర్ సత్యశారదాదేవితో మాట్లాడించి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా, గురువారం రాత్రి నాగరాజును అదుపులోకి తీసుకున్నామని డీసీపీ రవీందర్ తెలిపారు. కాగా గురువారం పొద్దుపోయాక మృతులిద్దరి అంత్యక్రియలను స్వగ్రామంలో పూర్తి చేశారు. కూతురు దీపిక తల్లిదండ్రుల మృతదేహాలకు తలకొరివి పెట్టారు.
పక్కా వ్యూహంతోనే హత్యలకు ప్లాన్
ఇద్దరూ విడిపోయాక హైదరాబాద్‌లోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయిన నాగరాజు నెల రోజుల క్రితం మళ్లీ గుండెంగ గ్రామంలో అమ్మమ్మ ఇంటికి చేరుకుని ఆటోను అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో దీపికకు వివాహ సంబంధాలు చూస్తున్నారనే విషయం తెలుసుకున్న నాగరాజు ఆమె కుటుంబంపై పగ తీర్చుకోవాలని పక్కా వ్యూహంతోనే రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది.
నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తాం: సీతక్క
హన్మకొండ: జంట హత్యలపై మంత్రి సీతక్క తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆమె ఒక ప్రకటనలో వెల్లడించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, దాడిలో గాయపడిన యువతికి, ఆమె సోదరుడికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపిన సీతక్క, బాధిత కుటుంబానికి రక్షణ కలి్పస్తామని వివరించారు.
బతిమిలాడినా వినలేదు.. నాగరాజును చంపేయాలి: దీపిక
నాకు తల్లిదండ్రులను లేకుండా చేసిన నాగరాజును చంపేయాలి.. మాకు వాటర్‌ప్లాంట్ నుంచి వాటర్ పోసేందుకు తండాకు వచ్చేవాడు. అలా పరిచయం అయిన తర్వాత నెక్కొండకు వెళ్లే క్రమంలో వెంటపడేవాడు. నన్ను హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఏడు నెలలైనా పెళ్లి చేసుకోలేదు. ఇద్దరికీ కుదరలేదు. హైదరాబాద్ నుంచి వచ్చాక తల్లిదండ్రులతో ఉంటున్నా. బుధవారం రాత్రి అమ్మా, నేను, నాన్న బయట పడుకున్నాం.
నాపై ఉన్న దుప్పటి తొలగించగా అరవడంతో అమ్మ లేచింది. బతిమిలాడుతున్నా కత్తితో దాడికి పాల్పడ్డాడు. నేను భయంతో నానమ్మ వాళ్ల ఇంటికి వెళ్లి అక్కడ స్పృహ తప్పి కిందపడిపోయా. ఆ తర్వాత లేచి సమీపంలో ఉన్న వదిన వాళ్ల ఇంటికి వెళ్లాను.. అక్కడికి సైతం వచ్చి పిలిచాడు. వాళ్లు నన్ను బయటకు రానివ్వలేదు. అందరు లేచి అరవడంతో పరారయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment