
కర్నూలు (టౌన్): వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పేర్లు మార్చుకుంటూ.. యువతులను ప్రేమ పేరుతో నమ్మించి మోసగిస్తున్న బీటెక్ విద్యార్థిని కర్నూలు ఒకటో పట్టణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాలివీ.. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం తగ్గపర్తి గ్రామానికి చెందిన అన్వేష్ అనంతపురం జేఎన్‌టీయూలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సోషల్ మీడియాలో యువతుల మొబైల్ నంబర్లు తెలుసుకుని వారిని ట్రాప్‌లో పడేసి ప్రేమిస్తున్నట్లు నమ్మిస్తున్నాడు.
అన్వేష్ అనే వ్యక్తిగా ఒకరితో, భరత్ అనే పేరుతో మరో అమ్మాయితో, చరణ్ అనే పేరుతో ఇంకో అమ్మాయితో మాట్లాడుతూ ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నాడు. ఈ క్రమంలో ఒక అమ్మాయికి వివాహం కాగా, ఆమె ఫొటోలను వాట్సాప్‌లో ఆమె కుటుంబ సభ్యులకు పంపిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాధితులు కర్నూలు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఒకటో పట్టణ సీఐ కళా వెంకటరమణ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. నిందితుడు అన్వేష్‌ను కర్నూలు కలెక్టరేట్ వద్ద గుర్తించి అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. సోషల్ మీడియాలో ఉన్న అమ్మాయిలు ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సీఐ హెచ్చరించారు.