జైపూర్: హరియాణాలో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. గో సంరక్షకులుగా అనుమానిస్తున్న కొందరు రాజస్తాన్‌కు చెందిన ఇద్దరు ముస్లింలను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత వారిద్దరి కాలిన మృతదేహాలు ఒక కారులో లభించడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన అరడజను మందికిపైగా బజరంగ్ దళ్ కార్యకర్తల్ని రాజస్తాన్ పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు. ఈ హత్యలను రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఖండించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాజస్తాన్‌లోని భరత్‌పూర్ జిల్లా ఘట్‌మీక గ్రామానికి చెందిన నజీర్ (25), జునైద్ అలియాస్ జునా (35)లను బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. గురువారం వారిద్దరి మృతదేహాలు హరియాణాలోని భివానిలో లోహారు ప్రాంతంలో ఒక దగ్ధమైన కారులో కనిపించాయి. బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆ ఇద్దరు ముస్లిం యువకుల్ని కిడ్నాప్ చేశారని వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి ఫిర్యాదు మేరకు అరడజనుకుపైగా బజరంగ్‌దళ్ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ‘‘వారికి ఈ నేరంలో ప్రమేయం ఉందో లేదో తేలాల్సి ఉంది’’ అని పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ గౌరవ్ శ్రీవాస్తవ చెప్పారు. మృతి చెందిన వారిలో జునైద్‌కి నేరచరిత్ర ఉందని, ఐదుకి పైగా కేసుల్లో అతను నిందితుడని చెప్పారు. రింకూ సైనీ అనే నిందితుడిని అరెస్టు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment