
జయపురం: నవరంగపూర్ జిల్లా ఉమ్మరకోట్‌లో శుక్రవారం రాత్రి తుపాకీ తూటాలు గర్జించాయి. ఆ తూటాలకు ఒక వ్యాపారి కుప్పకూలాడు. రాత్రి 10 గంటల సమయంలో జరిగిన ఈ సంఘటన పట్టణ ప్రజలలో భయాందోళన రేకెత్తించింది. వ్యాపార శతృత్వంతోనే ఈ సంఘటన జరిగి ఉండొచ్చని ప్రజలు అనుమానిస్తున్నారు. స్థానిక వ్యాపారి సంజీవ సుబుద్ధి రాత్రి 9 గంటలకు తన దుకాణం మూసివేసి ఇంటికి బయల్దేరాడు.దారిలో ఎలక్ట్రికల్ కార్యాలయం వద్ద టీ తాగి మిత్రులతో కాసేపు ముచ్చటించి రాత్రి 9.45 గంటలకు బైక్ నెమ్మదిగా నడుపుకుంటూ ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ సమీపంలో ముగ్గురు దుండగులు వ్యాపారిపై కాల్పులు జరిపారు.
ఆ కాల్పులకు గురైన సంజీవ్ సుబుద్ధి సంఘటనా స్థలంలోనే నేలకూలాడు. గమనించిన ఆ ప్రాంత ప్రజలు వెంటనే వ్యాపారిని ఉమ్మరకోట్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. అక్కడినుంచి నవరంగపూర్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అయితే వ్యాపారి సుబుద్ధి మరణించినట్లు అక్కడి డాక్టర్లు ప్రకటించారు. కొద్ది రోజుల కిందట సంజీవ్ సుబుద్ధి కొంత మందితో గొడవ పడ్డాడు. ఆ సంఘటనపై ఉమ్మరకోట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల క్రితం ముసుగులు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు సంజీవ్ సుబుద్ధి ఫర్నిచర్ దుకాణానికి వచ్చారని అయితే వారి మధ్య ఏం జరిగిందో తెలియదని చుట్టుపక్కల దుకాణదారులు చెబుతున్నారు.
గత రాత్రి జరిగిన కాల్పుల సంఘటనను ఉమ్మరకోట్ పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దుండగుల ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తుపాకీ కాల్పుల్లో వ్యాపారి దుర్మరణం చెందిన సమాచారం తెలుసుకున్న నవరంగపూర్ మాజీ ఎంపీ ప్రదీప్ మఝి హాస్పిటల్‌కు వెళ్లి మృతుని కుటుంబసభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.