గంజాయి చాక్లెట్లు తీసుకెళ్తున్న పట్టుబడిన నిందితులతో ఎక్సైజ్ అధికారులు (ఫైల్ )
ఖమ్మం: ఒడిశా నుంచి తెలంగాణలోని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు గంజాయి తరలించే స్మగ్లర్లకు జిల్లా రాచబాటగా మారింది. ఎక్సైజ్, పోలీసు అధికారులు ఎంత కట్టడి చేసినా.. తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నా ఎక్కడో చోట గంజాయి పట్టుబడడం సర్వసాధారణమైపోయింది. అయితే, ఇన్నాళ్లు గంజాయిని బస్తాల్లో.. ఆ తర్వాత పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం వాహనాల్లో ఇతర సరుకుల కింద తరలించేవారు. అనంతరం నూనెగా మార్చి కూడా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇదంత ఎందుకు అనుకున్నారో ఏమో కానీ ఏకంగా గంజాయిని చాక్లెట్ల రూపంలోకి మార్చి తరలిస్తుండగా ఎక్సై జ్ అధికారులు గుర్తించారు. తాజాగా జిల్లా కేంద్రంలో చేపట్టిన తనిఖీల్లో ఈ గంజాయి చాక్లెట్లు పట్టుబడగా అవాక్కవడం ఎక్సైజ్ పోలీసుల వంతు అయింది.
ఒడిశా టు హైదరాబాద్..
ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా గంజాయి సాగుకు పెట్టింది పేరు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పలువురు అక్కడకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి ప్యాకెట్లుగా తీసుకెళ్తుంటారు. తాజాగా అక్కడే గంజాయిని చాక్లెట్ల రూపంలోకి మార్చి ఎవరికీ అనుమానం రాకుండా మహిళల చేత రవాణా చేయిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు మహిళలు ఖమ్మంలో పట్టుబడగా... తనిఖీ చేసిన అధికారులే నివ్వెరపోయారు. ఒక్కో ప్యాకెట్‌లో ఐదు గ్రామాల చొప్పున 40చాక్లెట్లుగా ఉండగా ఆ ప్యాకెట్‌ను రూ.90కు కొనుగోలు చేసి రూ.400 చొప్పున విక్రయిస్తున్నట్లు గుర్తించారు. చార్మినార్ గోల్డ్, మున్కా తదితర పేర్లతో ఈ చాక్లెట్లు ఒడిశా ప్రాంతంలోనే తయారవుతున్నట్లు తెలిసింది.
చాక్లెట్లకు డిమాండ్..
గంజాయికి అలవాటు పడిన వారు పొడి కొనుగోలు చేయడం.. పీల్చడం చేస్తుంటారు. అయితే, ప్యాకెట్ల రవాణా సమయంలో తరచుగా పట్టుబడుతండడంతో అమ్మకం, కొనుగోలుదారులు చాక్లెట్లపై దృష్టి సారించినట్లు సమాచారం. దీంతో ఒడిశాలోని స్మగ్లర్లు గంజాయి చాక్లెట్లు తయారుచేస్తున్నట్లు తెలిసింది. తద్వారా వీటి వాడకం సులువవుతుందని, తనిఖీల్లోనూ పట్టుబడే అవకాశాలు తక్కువగా ఉంటాయనే భావనకు వచ్చినట్లు చెబుతున్నారు. అంతేకాక కావాల్సినప్రాంతాలకు చేరవేసి అమ్మడం సులువవుతుందని గంజాయిని చాక్లెట్ల రూపంలో మారుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లో కొన్నాళ్ల క్రితం చాక్లెట్లు పట్టుబడగా మూడు రోజుల క్రితం వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద మూడు కేజీల గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం సంచలనం కలిగించింది.
పోలీసులకు చిక్కేది కొందరే..
గంజాయి తరలిస్తూ పోలీసులకు చిక్కుతున్న వారు కొందరేనని.. అది కూడా కూలీలేనని సమాచారం. అసలు సూత్రధారులు ఎక్కడా పట్టుపడకుండా తెర వెనక ఉండి దందా నడిపిస్తుంటారని తెలిసింది. ఒడిశా నుంచి గంజాయితో జిల్లాకు చేరుకుంటున్న పలువురు సాధారణ ప్రయాణికుల మాదిరి బస్సుల్లో వెళ్తుండగా.. ఇంకొందరు రైళ్లను ఎంచుకుంటున్నారు. అయితే, తెలంగాణలో మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టాక ఇదే అదునుగా రద్దీగా ఉంటున్న బస్సుల్లో గంజాయిని తరలిస్తున్నట్లు తెలిసింది. అయితే, అసలు సూత్రధారులు దొరకనంత కాలం గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయడం సాధ్యం కాకపోవచ్చని పలువురు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment