సాక్షి,వరంగల్: వరంగల్ రైల్వేగేట్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని టీఆర్‌ఎస్ కార్పొరేటర్ భర్త పెండ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకుని మోసం చేశాడని బాధితురాలు మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం విధితమే. దీనిపై పోలీసులు స్పందించి లిక్కర్‌డాన్‌తోపాటు కార్పొరేటర్ భర్తపై అత్యాచారం, నమ్మకద్రోహం, బెదిరింపుల కేసు నమోదైంది.
బాధితురాలు ఫిర్యాదు చేసి ఐదు రోజుల కావస్తున్నా కేసులో పురోగతి లేదు. పోలీసులపై రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల ఒత్తిడీలు పెరగడంతో చేసేది ఏమీలేక ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. పేదలకు ఒక న్యాయం.. సంపన్నులకు మరో న్యాయమా అంటూ బయట నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితుల ఆచూకీ తెలిసినా వారిని అరెస్టు చేయలేక జంకుతున్నట్లు విశ్వసనీయ సమాచారం..
కేసులో పురోగతి ఏదీ..?
కేసులో పురోగతి కనిపించకపోవడంతో పోలీస్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నిందితులకు పలుకుబడి ఉండటం, అధికార పార్టీ నేతలు కావడంతో పోలీసులు ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు. 24గంటల్లోనే ఛేదించాల్సిన ఈకేసు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. తండ్రీకొడుకులపై కేసు నమోదై ఐదు రోజులు గడుస్తున్నా పురోగతి లేదు.
కేసుల నుంచి తండ్రీకొడుకులు బయటపడేందుకు రాజీమార్గాన్ని ఉపయోగించి బాధిత యువతిపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అధికార పార్టీ నేతలు, వారి అనుచరులను రంగంలోకి దించి ఆ యువతి ఇంటికి వెళ్లి పలుమార్లు సయోధ్యకు యత్నిస్తున్నట్లు తెలిసింది. నెల రోజులు తిరుగుతున్నా నన్ను పట్టించుకోకపోవడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతూ దిక్కున్న చోట చెప్పుకో అనడం వల్లే పోలీసులను ఆశ్రయించానని, ప్రస్తుతం తాను చేసేది ఏమీలేదని ఆ యువతి వారితో స్పష్టంగా చెప్పినట్లు సమాచారం.
బాధితురాలి ఇంటికి తాళం..
కేసు నుంచి ఎలాగైన బయటపడాలని లిక్కర్‌డాన్, కార్పొరేటర్ భర్త విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తరుచుగా బాధిత యువతి ఇంటికి వెళ్లి పలు మార్లు చర్యలు జరపడంతో విసుగెక్కిన ఆ యువతి మంగళవారం ఉదయాన్నే ఇంటికి తాళం వేసి తల్లితో కలిసి బంధువుల ఇంటికి వెళ్లినట్లు సమాచారం.
గాలింపు ముమ్మరం..
వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు మరింత ముమ్మరం చేశారు. బంధువుల ఇళ్లలో ఉండి బాధితురాలితో రాజీయత్నంతో పాటు బేల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల సైతం కేసును సవాలుగా స్వీకరించి ఎలాగై నిందితులను అరెస్ట్ చేయాలని పక్కా ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తున్నారు. ఏ క్షణనైనా పట్టుకునే అవకాశం లేకపోలేదు. బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ఏసీపీ గిరికుమార్‌ను వివరణ కోరగా నిందితులను పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment