ఎర్ర గంగిరెడ్డిని అదుపులోకి తీసుకుంటున్న సీబీఐ అధికారులు
పులివెందుల/కడప అర్బన్: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి అనుమానితుల ఇళ్లలో సీబీఐ అధికారులు బుధవారం ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. కడప కేంద్ర కారాగారంలోని గెస్ట్‌హౌస్‌లో అనుమానితులను, ముగ్గురు ఎస్‌బీఐ అధికారులను విచారించారు. హత్య జరిగిన తర్వాత వివేకా ఇంట్లో రక్తపు మరకలను తుడిచేసిన ఘటనకు సంబంధించి పులివెందుల పట్టణంలోని బయమ్మ తోటలో ఉంటున్న వైఎస్ వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో సోదాలు చేశారు. నిత్యావసరానికి ఉపయోగించే మచ్చుకత్తి, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. టి.తుమ్మలపల్లెలోని గంగిరెడ్డి సోదరులు, బంధువుల ఇళ్లలో కొడవళ్లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
భాకరాపురంలోని సునీల్‌కుమార్ యాదవ్ నివాసంలోనూ సోదాలు చేశారు. బ్యాంక్ అకౌంట్ బుక్‌లను, చెక్ కాపీతో పాటు పాత చొక్కాను తీసుకెళ్లారు. అనంతరం సునీల్‌కుమార్ సొంత గ్రామమైన మోట్నూతలపల్లెకు తండ్రి కృష్ణయ్యను తీసుకెళ్లి వారి నివాసాన్ని తనిఖీ చేసి అక్కడ కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సునీల్‌కుమార్ అత్త గ్రామమైన యల్లనూరు మండలం వెన్నపూసపల్లెలో వ్యవసాయానికి ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. భాకరాపురంలోని దస్తగిరి నివాసంలో 5 కొడవళ్లు, బ్యాంకు అకౌంట్ బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పులివెందుల కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న ఉమా శంకర్‌రెడ్డి నివాసం, ప్రొద్దుటూరులో ఆయన సోదరుడి ఇంట్లో సోదాలు చేశారు. సుంకేసుల గ్రామంలో కూడా కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వైద్య విభాగం కార్యదర్శి వైఎస్ అభిషేక్‌రెడ్డిని, ఉమా శంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు.
కర్ణాటక నుంచి బ్యాంక్, రెవెన్యూ అధికారుల రాక
కర్ణాటక నుంచి 20 వాహనాల్లో బ్యాంక్, రెవెన్యూ అధికారులు బుధవారం కడపకు వచ్చారు. వారంతా సీబీఐ అధికారులతో కలిసి ఉదయాన్నే బయటకు వెళ్లిపోయారు. కడపకు చెందిన ముగ్గురు ఎస్‌బీఐ అధికారులు బుధవారం విచారణకు హాజరయ్యారు. కర్ణాటకలో ల్యాండ్ సెటిల్‌మెంట్‌కు సంబంధించి వైఎస్ వివేకానందరెడ్డి, సునీల్ కుమార్ యాదవ్ మధ్య వివాదం ఉన్న నేపథ్యంలో అక్కడి బ్యాంక్, రెవెన్యూ సిబ్బందిని సీబీఐ అధికారులు పిలవడం చర్చనీయాంశంగా మారింది. సునీల్‌కుమార్ యాదవ్ సీబీఐ కస్టడీలో ఇచ్చిన సమాచారం మేరకు అన్ని ప్రాంతాల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం సీబీఐ అధికారులను కలిసి వెళ్లారు. కేసు దర్యాప్తు గురించి అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment