
రాయ్‌పూర్: ఇటీవల సమాజంలో జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తుంటే వయసుతో సంబంధం లేకుండా దారుణాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. ఈ తరహాలో చదువులు, ఆటలు మధ్య గడపాల్సిన ఇద్దరు మైనర్ల బాల్యం తాము చేసిన హత్య కారణంగా కటకటాల్లోకి నెట్టేసింది. ఈ ఘటన ఛతీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రాయ్‌గఢ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు.
ఇంతలో 17 ఏళ్ల వయసు గల ఇద్దరు బాలురు అక్కడికి వచ్చి ఆ విద్యార్థితో వాగ్వాదానికి దిగారు. అది కాస్త ముదిరి వారిద్దరు అతన్ని తీవ్రంగా కొట్టి పొడిచారు. అనంతరం వాళ్లు స్కూలు సిబ్బందిని కత్తితో బెదిరించి ఆ ప్రాంతం నుంచి తప్పించుకున్నారు. బాధితుడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం రాయ్‌గఢ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిషేక్ మీనా నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి అదే రోజు రాత్రి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి వెనుక ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని, కానీ ప్రేమ వ్యవహారం దీనికి కారణమని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: Bullettu Bandi Bride: ‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్ ఆఫర్