హాన్ జున్వేను అరెస్టు చేసిన బీఎస్‌ఎఫ్ అధికారులు
సాక్షి, సిటీబ్యూరో: అక్రమంగా సరిహద్దులు దాటుతూ పశ్చిమ బెంగాల్‌లో బీఎస్‌ఎఫ్ అధికారులకు గత గురువారం పట్టుబడిన చైనా జాతీయుడు హాన్ జున్వే వెనుక పెద్ధ కథ ఉన్నట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి. భారత సైనిక రహస్యాలు సేకరించడానికి పాకిస్తాన్ చేస్తున్న కుట్రలకు చైనా ఆర్థిక సహాయం చేస్తున్నట్లు వివరిస్తున్నాయి. దీనికోసమే అనేక మంది తమ ఏజెంట్లను భారత్‌కు పంపి, నకిలీ గుర్తింపు కార్డులతో బ్యాంకు ఖాతాలు తెరిచేలా, సిమ్‌కార్డులు ఖరీదు చేసేలా చేస్తున్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించాయి. తాను 2010లో హైదరాబాద్, 2014లో ఢిల్లీ వచ్చి వెళ్లినట్లు హాన్ జున్వే అంగీకరించడంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి.
ఆపరేషన్ క్రాస్ కనెక్షన్‌తో మొదలు...
ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), మిలటరీ ఇంటెలిజెన్స్ విభాగం సంయుక్తంగా ఆపరేషన్ క్రాస్ కనెక్షన్ పేరుతో గతేడాది డిసెంబర్‌లో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఆర్మీలో సిగ్నల్ మ్యాన్‌గా పని చేసి, ఆరోగ్య కారణాల నేపథ్యంలో గతేడాది జూన్‌లో ఉద్యోగ విరమణ చేసిన సౌరబ్ శర్మను వెతికి పట్టుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. 2014లో ఫేస్‌బుక్ ద్వారా పాకిస్తాన్‌కు చెందిన పాకి ఇంటెలిజెన్స్ ఆపరేటింగ్ తో (పీఐఓ) ఇతడికి పరిచయం ఏర్పడింది.
వారి వల్లో పడి 2016 నుంచి ఐఎస్‌ఐ కోసం పని చేయడం ప్రారంభించిన సౌరబ్ శర్మ మిలటరీకి సంబంధించిన అత్యంత సున్నిత సమాచారాన్ని సైతం చేరవేశారు. ప్రతిఫలంగా ఇతడికి పెద్ద మొత్తాలే అందుతూ వచ్చాయి. ఈ విషయం సౌరవ్ ఉద్యోగ విరమణ చేసిన తర్వాత గుర్తించిన మిలటరీ ఇంటెలిజెన్స్ అతడి స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్ కావడంతో అక్కడి ఏటీఎస్‌కు చేరవేసింది. గతేడాది డిసెంబర్ నుంచి వేటాడటం మొదలెట్టిన సంయుక్త బృందాలు ఈ ఏడాది జనవరి మొదటి వారంలో సౌరవ్‌ను పట్టుకున్నాయి.
ఏటీఎస్ అధికారులు అరెస్టు చేసిన సున్ జీ యంగ్, యూ యున్ ఫూ, లే టెంగ్ లీ
నగదు లావాదేవీలపై ఆరా తీయగా...
సౌరవ్ విచారణలో ఐఎస్‌ఐ నుంచి ఇక్కడి దేశ ద్రోహులకు నగదు ఎలా అందుతోందనే విషయాన్నీ నిఘా వర్గాలు ఆరా తీశాయి. ఒకప్పుడు హవాలా ద్వారా అందేదని, అది ఎక్కడ నుంచి వస్తోందో మాత్రం తనకు తెలియదని చెప్పాడు. గతేడాది నుంచి మాత్రం నకిలీ గుర్తింపు పత్రాలతో తెరిచిన బ్యాంకు ఖాతాలు, వేరే వారి పేర్లపై ఉండే సిమ్‌కార్డులు ఉపకరిస్తున్నాయని బయటపెట్టాడు. ఈ వ్యవహారాల వెనుక మాత్రం చైనీయులు ఉన్నట్లు వెల్లడించాడు. దీంతో దర్యాప్తు కొనసాగించిన ఏటీఎస్ అధికారులు జనవరి 18న 14 మంది ఉత్తరప్రదేశ్ వాసుల్ని అరెస్టు చేశారు.
కరోనా వేళా ఆన్‌లైన్‌లో ఖాతాలు తెరిచి..
వీరిలో కీలక నిందితుడైన మురాదాబాద్ వాసి ప్రేమ్ సింగ్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం చైనీయులకు గతేడాది జూలై నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఈ గ్యాంగ్ మొత్తం 1500 ప్రీయాక్టివేటెడ్ (వేరే వారి పేర్లపై ఉండే) సిమ్‌కార్డులు అందించారు. కరోనా ప్రభావంతో గత సంవత్సరం నుంచి బ్యాంకులు ఆన్‌లైన్ కేవైసీ దాఖలు చేసి ఖాతాలు తెరుచుకునే అవకాశం ఇచ్చాయి. దీంతో చైనీయులు నకిలీ పత్రాలు వినియోగించి భారతీయుల పేర్లతో అనేక బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు.
ఓటీపీల కోసం సిమ్‌కార్డులు...
ఏటీఎం కేంద్రాల్లో డెబిట్ కార్డు లేకుండా నగదు డ్రా చేసుకునే అవకాశం ఉంది. దీనికోసం ఓటీపీ పొందడానికి ఖాతాలో లింకై ఉన్న ఫోన్ నెంబర్ అవసరం. ఈ నెంబర్లుగా వినియోగించడానికే చైనీయులు భారీ మొత్తం వెచ్చించి ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌కార్డులు ఖరీదు చేస్తున్నట్లు ప్రేమ్‌సింగ్ వెల్లడించాడు.
ఇతడిచ్చిన సమాచారం ఆధారంగా ఏటీఎస్ అధికారులు జనవరి 24న అక్కడి గౌతమ్‌బుద్ధ నగర్ నుంచి యూ యున్ ఫూ, లే టెంగ్ లీలను అరెస్టు చేశారు. దీనికి కొనసాగింపుగా రెండు రోజుల తర్వాత హర్యానాలో ఉంటున్న సున్ జీ యంగ్ అనే మరో చైనీయుడిని పట్టుకున్నారు. ఇతడి విచారణలోనే హాన్ జున్వే పేరు వెలుగులోకి వచ్చింది.
చదవండి: వర్మకు షాక్: ‘దిశ ఎన్‌కౌంటర్’ విడుదలకు బ్రేక్
Comments
Please login to add a commentAdd a comment