కర్ణాటక: కుమార్తెను విదేశాలకు పంపి విమానాశ్రయం నుంచి ఇంటికి ప్రయాణమైన దంపతులు మార్గం మధ్యలోనే మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన కోలారు జిల్లా శ్రీనివాసపురం తాలూకా చాకప్పపల్లి గ్రామం వద్ద శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణానికి చెందిన షేక్ షఫీవుల్లా (62), శహీనా బేగం(55) దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ఇద్దరు కుమార్తెలకు వివాహమైంది.
మూడో కుమార్తె శిల్ప బీటెక్ పూర్తి చేసింది. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాలని భావించింది. దీంతో కుమార్తెను తీసుకొని గురువారం అర్ధరాత్రి బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయానికి చేరుకున్నారు. వేకువజామున శిల్పను ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానంఎక్కించి వీడ్కోలు పలికారు. అనంతరం దంపతులు మదనపల్లికి బయల్దేరారు. చాకప్పపల్లి వద్దకు రాగానే కారు అదుపు తప్పి రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది.
ప్రమాదంలో దంపతులు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. గౌనిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి క్రేన్ సాయంతో కారును వెలికితీసి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను శ్రీనివాసపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.కేసు దర్యాప్తులో ఉంది. కాగా దంపతులు మృతి చెందిన విషయాన్ని విమానాశ్రయ అధికారులు వారి కుమార్తెకు సమాచారం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment