
సాయిలక్ష్మి- సుబ్బారావు(ఫైల్ ఫొటోలు)
అనారోగ్య సమస్యలతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారా.. లేక భార్యను గొంతునులిమి చంపి తర్వాత సుబ్బారావు ఏదైనా విష ప్రయోగం చేసుకున్నాడా
పంజగుట్ట: ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనుమానాస్పద స్థితిలో భార్య, అపస్మారక స్థితిలో పడి చికిత్స పొందుతూ ఆమె భర్త మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే .. రహమత్‌నగర్‌లో నివసించే ఎన్.సుబ్బారావు కారు డ్రైవర్. ఇతడి భార్య ఎన్.సాయిలక్ష్మి(42) గృహిణి. సాయిలక్ష్మికి బ్రైయిన్ స్ట్రోక్ రావడంతో చికిత్స నిమిత్తం రాజ్‌భవన్ క్వార్టర్స్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు సహాయకుడిగా భర్త సుబ్బారావు అక్కడే ఉంటున్నాడు. ఈ నెల 11వ తేదీన ఉదయం ఆస్పత్రి సిబ్బంది వెళ్లి చూడగా ఇద్దరూ అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే సిబ్బంది కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో నివసించే వీరి కూతురు ఎన్.శివాణికి ఫోన్ చేసి సమాచారం అందించారు. ఆమె ఉదయం 4:30 గంటల లోపు అక్కడకు వచ్చి చూసే సరికి తండ్రి అపస్మారక స్థితిలో ఉండగా తల్లి అప్పటికే మృతి చెందింది.
ఇక, సుబ్బారావును చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా అతడు కూడా శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారి బెడ్ పక్కనే సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో నా చావుకు ఎవ్వరూ కారణం కాదు. ఆస్పత్రి సిబ్బందికి తన చావుకు ఎలాంటి సంబంధం లేదు. మానసిక వ్యధతో చనిపోతున్నాను. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే తమ దహన సంస్కారాలు చేయాలని రాసి ఉంది. కాగా అనారోగ్య సమస్యలతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారా.. లేక భార్యను గొంతునులిమి చంపి తర్వాత సుబ్బారావు ఏదైనా విష ప్రయోగం చేసుకున్నాడా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు సెక్షన్–174, 309 ఐపీసీ చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: చెట్టుపై కూర్చున్నట్లుగా యువతి మృతదేహం.. అసలేం జరిగింది?