సాక్షి, ఉప్పలగుప్తం: కోనసీమలో ఆయిల్‌మాఫియా ఆగడాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఒకప్పుడు జోరుగా సాగే వైట్ ఆయిల్ రాకెట్ గుట్టురట్టు కావడంతో కొన్నాళ్లుగా ఆయిల్ చోరీకి బ్రేక్ పడింది. అప్పట్లో ఓఎన్జీసీ పైప్‌లైన్, ఆయిల్ ట్యాంకర్ల నుంచి ఆయిల్ చోరీ జరిగితే.. ఇప్పుడు ఏకంగా చమురు సహజవాయు నిక్షేపాల వెలికితీతకు డ్రిల్ చేసిన ప్రాంతాల్లోని వెల్(టెర్మినేటర్) నుంచి దర్జాగా పైపులైన్ వేసుకుని ఆయిల్ చోరీ చేసే స్థాయికి మాఫియా ఎదిగిపోయింది. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ వాసాలతిప్ప తీరంలో గతేడాది ఓఎన్జీసీ ఏర్పాటు చేసిన డ్రిల్ సైట్ ఈ ఆయిల్ మాఫియాకు అడ్డాగా మారింది. రోజుకు వెయ్యి నుంచి రెండు వేల లీటర్ల వైట్ ఆయిల్ అక్రమరవాణా అవుతోంది.
ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిపంచాయతీ వాసాలతిప్ప సముద్ర తీరంలో ఉన్న ఓఎన్జీసీ జీఎస్ 15 డ్రిల్ సైట్ నుంచి వెల్ నుంచి నేరుగా గోపవరం పంచాయతీలో ఉన్న జగ్గరాజుపేట స్టోరేజ్‌కు పైపులైన్‌ల ద్వారా క్రూడాయిల్, గ్యాస్‌లను తరలిస్తున్నారు. ఏడాదిగా వెల్ నుంచి ముడిచమురు గ్యాస్ పైపులైన్ల ద్వారా రవాణా అవుతుంది. గ్రామానికి దూరంగా ఉన్న ఈ సైట్‌ను కేంద్రంగా చేసుకుని ఆయిల్ మాఫియా ఆరు నెలల నుంచి చోరీకి పాల్పడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి 20న ఆయిల్ చోరీ జరుగుతుందని అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదై ఉంది.
ఓఎన్జీసీ అధికారులు సెక్యూరిటీ ఏర్పాటుకు సదరు సంస్థకు ప్రతిపాదించి చేతులు దులుపుకొన్నారు. అయితే వాసాలతిప్ప గ్రామస్తులు మాత్రం ముఠాపై కన్నేశారు. ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి ఆయిల్ చోరీని గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముఠాను పట్టుకునే ప్రయత్నం చేయగా, వారు చోరీకి ఉపయోగించే మోటార్లు, పైపులు, స్టోరేజ్ టిన్నులు, మారుతీ ఓమ్నీ వ్యాను వదిలి పరారయ్యారు. చోరీ ముఠాలో ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించినట్టు తెలిసింది. అయితే గురువారం తెల్లవారు జామున ఎస్సై జి.వెంకటేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తమ అదుపులో ఎవరూ లేరని పోలీసులు చెబుతున్నారు.
అధికారుల పరిశీలన
ఓఎన్జీసీ ఏరియా మేనేజర్ ప్రసాదరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామన్నారు. అమలాపురం రూరల్ సీఐ జి.సురేష్‌బాబు పరిశీలించి, ఓఎన్జీసీ సెక్యూరిటీ అధికారి తో మాట్లాడారు. ఓఎన్జీసీ ఐఎం జగన్నాథరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్టు తెలిపారు.
గ్రామస్తుల ఆందోళన
వాసాలతిప్ప వచ్చిన ఓఎన్జీసీ అధికారులను స్థానికులు నిలదీశారు. స్థానిక సమస్యలపై మీరిచ్చిన హామీలు ఏం చేశారంటూ ఆందోళనకు దిగారు. స్థానిక నాయకులు పినిపే జయరాజ్, ఇసుకపట్ల రఘుబాబు, గెడ్డం సంపదరావు, పట్టా శ్రీను తదితరులు నచ్చజెప్పి, డిమాండ్ల పరిష్కారానికి హామీ తీసుకున్నారు.
రూ.లక్ష విలువైన ఆయిల్ చోరీ...
రోజుకు రూ.లక్ష విలువైన ఆయిల్ చోరీ జరుగుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 30 టిన్నులు(ఒక్కొక్కటి 50 లీటర్లు) ఆయిల్ ఇక్కడి నుంచి రవాణా అవుతోంది. ఇక్కడి నుంచి మామిడికుదురు మండలంలో ఓ వ్యాపారి లీటరు ఆయిల్ రూ.50 నుంచి రూ.60కి హోల్‌సేల్ రేటుగా తీసుకుంటున్నట్టు తెలిసింది. ఆయిల్ చోరీ ఆలస్యంగా బయటకు వచ్చినా దీని వెనుక ఇంటి దొంగల హస్తం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సాంకేతిక పరిజ్ఞానంతో చోరీ..
ఓఎన్జీసీ డ్రిల్ సైట్ వెల్ నుంచి వెలువడే గ్యాస్, ముడిచమురు, నీరును చాకచక్యంగా విభజించి నేరుగా వైట్ ఆయిల్ టిన్నుల్లోకి నింపడం సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పని. పోలీసులు స్వాధీనం చేసుకున్న సామగ్రిలో (సెపరేటర్)గ్యాస్ విడిగా, వాటర్ విడిగా పోయి ఆయిల్ మాత్రమే నింపేలా తయారైన యంత్ర పరికరాలు లభించడం చోరీలో నైపుణ్యం గల వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది.
( చదవండి: సైబర్ నేరగాళ్ల చేతి వాటం.. రూ.1.2 లక్షలు స్వాహా )
Comments
Please login to add a commentAdd a comment