సాక్షి, సిటీబ్యూరో: ఏపీ ప్లస్ సంస్థ తరఫున ఖతర్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎర వేసిన సైబర్ నేరగాళ్లు నిరుద్యోగుల్ని నిండా ముంచారు. దీనిపై ఆ సంస్థ మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బేగంపేట కేంద్రంగా పని చేసే ఏపీ ప్లస్ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా పదుల సంఖ్యలో బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈ కంపెనీకి సంబంధించిన ఖతర్ బ్రాంచ్‌లో ఉద్యోగాల పేరుతో సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్‌లో ప్రకటనలు చేశారు. అనేక మందిని ఫోన్‌లో ఇంటర్వ్యూలు కూడా చేసి నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చారు.
కొందరు బాధితులు ఖతర్‌లోని సంస్థ కార్యాలయాన్ని ఫోన్ ద్వారా సంప్రదించారు. ఇలా విషయం తెలుసుకున్న ఆ బ్రాంచ్ అధికారులు హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఆరా తీసిన ఇక్కడి అధికారులు నగరానికి చెందిన నలుగురికి అలాంటి లెటర్లు అందినట్లు గుర్తించారు. వీరి నుంచి రూ.13,500 చొప్పున వసూలు చేసిన సైబర్ నేరగాళ్లు మరో రూ.35 వేలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుసుకున్నారు. దీంతో ఈ వ్యవహారంపై ఆ సంస్థ ప్రతినిధులు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment