మైసూరు: పార్ట్ టైం పని ఇప్పిస్తామని నమ్మించి యువతి వద్ద సైబర్ మోసగాళ్లు సుమారు రూ. 3.38 లక్షలను కొట్టేశారు. మైసూరు నగరంలోని కెసరెలో ఈ ఘటన జరిగింది. ఎన్. మైత్రి బాధితురాలు. ఆమె మొబైల్ ఫోన్‌కు పార్ట్ టైమ్ పని ఉందని గుర్తు తెలియని వ్యక్తి మొబైల్ నుంచి మెసేజ్ లింక్ వచ్చింది. తరువాత ఆమె వాట్సాప్‌కు మరో మెసేజ్ వచ్చింది. మీకు పార్ట్ టైమ్ పని కోసం కొన్ని వస్తువులను పంపిస్తాము.
మీరు ఇంటి వద్ద ఉండే పని చేసుకోవచ్చు, ఇందుకు కొంత రుసుము చెల్లించాలని మోసగాళ్లు చెప్పారు. వారు చెప్పిన నంబర్‌కు మైత్రి రూ.100 పంపింది. తరువాత తన బ్యాంకు ఖాతా, ఇతర వివరాలను ఇచ్చింది. వెంటనే ఆమె ఖాతా నుంచి సుమారు రూ. 3.38 లక్షల నగదు మాయమైంది. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
టెక్కీకి రూ.2.90 లక్షలు మోసం
ఐటీ ఇంజనీర్ ఒకరు వెబ్‌సైట్ ద్వారా సెకెండ్ హ్యాండ్ కారు కొనాలని భారీగా డబ్బు కోల్పోయాడు. ఈ ఘటన మైసూరు నగరంలో చోటు చేసుకుంది. రామకృష్ణ నగరవాసి, టెక్కీ ఎం.మనోజ్ బాధితుడు. ఇతడు కార్‌వాలె అనే వెబ్‌సైట్‌లో తక్కువ ధరకు సెకెండ్ హ్యాండ్ కార్ల కోసం వెతికాడు. అందులో ఒక కారు నచ్చడంతో అక్కడ ఉన్న నంబర్లకు కాల్ చేశాడు. వారు కాల్ ఎత్తకుండా, వాట్సాప్ ద్వారా సమాధానం ఇచ్చారు.
వారు లింక్‌లో పంపినఒక వెబ్‌సైట్‌ను తెరిచి అన్ని వివరాలను నమోదు చేశాడు. కారును రూ.2.90 లక్షలకు అమ్ముతామని మోసగాళ్లు చెప్పారు, కారును మైసూరుకు తరలించడానికి రూ.3150 చార్జీ కట్టాలన్నారు. వారు చెప్పినట్లు మనోజ్ ఆన్‌లైన్లో నగదును చెల్లించాడు. తరువాత ఫోన్ చేయగా మోసగాళ్లు స్పందించలేదు. దీంతో టెక్కీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
(చదవండి: ఆమె సౌందర్యమే శాపమైంది)
Comments
Please login to add a commentAdd a comment