సాక్షి, హైదరాబాద్: సోషల్‌మీడియా యాప్ ఇన్‌స్ట్రాగామ్‌లో యువతిగా ప్రొఫైల్ క్రియేట్ చేసిన ఓ యువకుడు పలువురు యువతులతో ఆన్‌లైన్ ఫ్రెండ్‌షిప్ చేశాడు. ఈ ముసుగులో వారి బలహీనతల్ని తనకు అనువుగా మార్చుకున్నాడు. అదును చూసుకుని బ్లాక్‌మెయిలింగ్ ప్రారంభించాడు. దాదాపు 70 మందిని బాధితులుగా మార్చిన ఈ నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన సుమంత్ మాదాపూర్‌లో ఉంటూ అమేజాన్‌లో కస్టమర్ కేర్ విభాగంలో పని చేస్తున్నాడు.
గత ఏడాది కరోనా ప్రభావంతో అమలులోకి వచ్చిన లాక్‌డౌన్ నుంచి దారి తప్పాడు. యువతి మాదిరిగా ఇన్‌స్ట్రాగామ్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. దీనికి డిస్‌ప్లే పిక్చర్‌గా (డీపీ) ఇంటర్‌నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన ఫొటో పెట్టాడు. దీనిని వినియోగించి అనేక మంది మహిళలు, యువతులను ఆన్‌లైన్ ఫ్రెండ్స్‌గా మార్చుకున్నాడు. వారితో కొన్నాళ్ల పాటు యువతి మాదిరిగానే చాటింగ్ చేశాడు. ఎదుటి వారు పూర్తిగా తనను నమ్మారని గుర్తించిన తర్వాత అసలు కథ మొదలు పెట్టేవాడు. ఓ దశలో వారి బలహీనతల్ని తనకు అనువుగా మార్చుకుంటూ వారితో సెక్స్ చాటింగ్స్ చేసేవాడు.
ఇలా కొన్ని రోజుల అనంతరం ఇంటర్‌నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన ఏదో ఒక అమ్మాయి అర్ధ నగ్న ఫోటోలు, నగ్న ఫొటోలను అవతలి వారికి పంపి తనవేనని నమ్మించేవాడు. ఆపై వారినీ అలాంటివే పంపమంటూ ఒత్తిడి చేసేవాడు. సుమంత్ వల్లో పడిన అనేక మంది తమ ఫొటోలను కూడా పంపించారు. ఆ ఫొటోలు తన దగ్గరకు వచ్చిందే తడవుగా బ్లాక్‌మెయిలింగ్ మొదలెడతాడు. తాను యువకుడిననే విషయం వారితో చెప్పే సుమంత్ ఫొటోలు బయటపెడతానంటూ భయపెట్టేవాడు. తనకు మాదాపూర్‌లో రూమ్ ఉందని, అక్కడికి వచ్చి కలవాలంటూ చెప్పేవాడు. ఇప్పటి వరకు చాటింగ్స్‌లో చర్చించిన అంశాలను ప్రాక్టికల్‌గా చేయడానికి సహకరించాలని బెదిరించేవాడు.
ఇలా దాదాపు 70 మంది బాధితురాళ్ల ఫొటోలు, స్క్రీన్ షాట్స్‌ను తమ ఫోన్‌లో సేవ్ చేసుకుని వేధింపులకు పాల్పడ్డాడు. ఎట్టకేలకు ధైర్యం చేసిన ఓ బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్సై మహిపాల్ సాంకేతికంగా దర్యాప్తు చేశారు. నిందితుడు సుమంత్‌ను గుర్తించిన అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతడు నేరం అంగీకరించడంతో పాటు ఫోన్‌లో ఆధారాలు లభించడంతో అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment