న్యూఢిల్లీ: ఒక యువతితో స్నేహం చేసినందుకు ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని ఆమె బంధువులు కొట్టి చంపారు. ఈ నెల 7న ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం పశ్చిమ ఢిల్లీ ఆదర్శనగర్‌లో ఉంటున్న 18 ఏళ్ల వయసున్న రాహుల్ రాజ్‌పుత్ ఢిల్లీ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కుటుంబాన్ని పోషించడానికి చాలా మందికి ట్యూషన్లు చెబుతూ ఉండేవాడు. అదే ప్రాంతానికి చెందిన ఒక అమ్మాయితో స్నేహం బాగా బలపడింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో వారి స్నేహం నచ్చక అమ్మాయి తరఫు బంధువులు రాహుల్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత రాహుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు నార్త్‌వెస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ఆర్య చెప్పారు.
అయిదు మంది కలిసి రాహుల్‌ని తోస్తూ పక్కకి లాగడం, అతనిపై దాడికి దిగిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆ అమ్మాయి సోదరుడు, మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి కుటుంబానికి ఢిల్లీ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసింది. పల్లెటూరు నుంచి వచ్చిన ఆ కుటుంబాన్ని రాహుల్ పోషిస్తున్నాడని, అందరికీ సాయపడుతూ ఉండే అతని మృతి ఆ కుటుంబానికి తీరని లోటని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. శనివారం ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. దోషుల్ని కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment