సాక్షి, జగిత్యాల: అనుమానం, ఇంట్లో గొడవ, ఆర్థిక పరమైన అంశాలు, మంత్రాలు, పాత కక్షలు.. కారణమేదైనా ఎదుటి మనిషిని చంపడమే పరిష్కారమని పలువురు అనుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత వారం రోజుల వ్యవధిలో ఐదుగురు హత్యకు గురవడం కలకలం సృష్టిస్తోంది. వరుసగా చోటుచేసుకుంటున్న హత్యోదంతాలు తాజా మానవ సంబంధాలకు అద్దం పడుతున్నాయి. మనుషుల్లో సున్నితత్వం లోపించడం, కక్షపూరిత ధోరణి పెరగడం వల్లే హత్యలు జరుగుతున్నాయని మానసిక నిపుణులు అంటున్నారు.
క్షణికావేశంలో ప్రాణాలు తీస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఇది మంచి పరిణామం కాదని పేర్కొంటున్నారు. హంతకులను పట్టుకొని, తక్షణమే శిక్షించడం ద్వారా ఇలాంటి ఘోరాలు తగ్గే అవకాశం ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో వరుస హత్యలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
భర్తను హతమార్చిన భార్య..
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తికి చెందిన ఒడ్నాల రాజగంగారాం (45) అతని భార్య భాగ్యలక్ష్మి చేతిలోనే ఈ నెల 18న హత్యకు గురయ్యాడు. రాజగంగారాం నిత్యం మద్యం సేవించి, అనుమానంతో తన భార్యను వేధించేవాడు. గత గురువారం తెల్లవారుజామున ఇద్దరూ గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఆమె తనను తాను కాపాడుకునేందుకు భర్తను కత్తెరతో పొడిచి, తలపై రోకలి బండతో మోదడంతో అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు.
మంత్రాల నెపంతో వ్యక్తి హత్య..
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూర్ శివారులో ఈ నెల 19న మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం గూడెంకు చెందిన సూర దుర్గయ్య (55) దారుణ హత్యకు గురయ్యాడు. మంత్రాలు చే స్తున్నాడనే నెపంతో స్థానికులే అతన్ని చంపినట్లు నిర్ధారణకు వచ్చామని పోలీసులు తెలిపారు. మద్య ం తాగించేందుకు బైక్‌పై తీసుకెళ్లి, తలపై బండతో కొట్టడంతో ప్రాణాలు విడిచాడన్నారు.
క్షణికావేశంలో దారుణాలు..
కుటుంబ కలహాలు, అనుమానం, ఆవేశంతో కట్టుకున్న భార్యలను కడతేర్చేందుకు కూడా కొందరు భర్తలు వెనకాడటం లేదు. తాగుడుకు బానిసై చిన్న చిన్న గొడవలనే పెద్దవి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మాటామాట పెరిగి, క్షణికావేశంలో కట్టుకున్నవారిని కడతేరుస్తున్నారు. పాత కక్షలు, భూ వివాదాలను మనసులో పెట్టుకొని, బహిరంగంగానే హత్యలకు పాల్పడుతుండటంతో ప్రజలు భయపడుతున్నారు. నేరం చేసిన వారిని వెంటనే శిక్షించేలా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని పలువురు కోరుతున్నారు.
నడిరోడ్డు పైనే దారుణం...
ఈ నెల 17న పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, వెంకటనాగమణి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే హంతకులు కత్తులతో ఘాతుకానికి పాల్పడటం కలకలం రేపింది. కళ్లముందే కత్తులతో దాడి చేస్తున్నప్పటికీ చుట్టూ ఉన్నవారు మిన్నకుండి పోయారు.
ఆ సమయంలో ఎవరైనా స్పందించినా ప్రాణాలు దక్కే అవకాశం ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. కళ్లముందు దారుణం జరుగుతున్నప్పటికీ మనకెందుకులే అన్న (బైస్టాండెడ్ అపతి) స్థి తిలో ప్రత్యక్ష సాక్ష్యులు ఉండిపోయారని మానసిక నిపుణులు అంటున్నారు. సమాజంలో ఈ పరిస్థితి ప్రమాదకరమని చెబుతున్నారు.
మనుషుల్లో సున్నితత్వం లోపిస్తోంది..
నేటి సమాజంలో మానవ సంబంధాలు క్రమంగా దిగజారుతున్నాయి. మనుషుల్లో సున్నితత్వం లోపిస్తున్న కారణంగా నేరం చేయడం తప్పుకాదన్న భావన పెరుగుతోంది. క్షణికావేశం, పాత కక్షలు, సహనం కోల్పోవడం కారణంగా హత్యలు జరుగుతున్నాయి. హంతకులకు త్వరితగతిన శిక్షలు అమలు చేస్తే కొంతవరకు నేర ప్రవృత్తి తగ్గే అవకాశం ఉంది. పాఠశాల స్థాయి నుంచే నైతిక విలువల బోధన సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గౌతమ్, సైకాలజిస్ట్
దోషులకు త్వరగా శిక్ష పడాలి..
ఇటీవల జరిగిన వరుస హత్యలను పరిశీలిస్తే ఆవేశాలు, అనుమానాలతోనే చేసినట్లు స్పష్టమవుతోంది. ఉద్ధేశపూర్వకంగా చేసే ఇలాంటి నేరాలపై కోర్టులు త్వరితగతిన విచారణ చేపట్టాలి. నేరారోపణ రుజువైన వెంటనే దోషులకు కఠిన శిక్షలు విధించాలి. ప్రభుత్వ యంత్రాంగం సైతం ప్రజాచైతన్య కార్యక్రమాలు చేపట్టాలి.
– బండ భాస్కర్‌రెడ్డి, న్యాయవాది, బార్ అసోషియేషన్ అధ్యక్షుడు, జగిత్యాల
చదవండి:
కీలకంగా మారిన బిట్టు.. మధుపై అనుమానం!
న్యాయవాదుల హత్య: రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
వామన్‌రావు హత్య కేసులో కీలక విషయాలు
Comments
Please login to add a commentAdd a comment