సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి మరో షాక్ తగిలింది. జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఛార్జ్‌షీట్ నమోదు చేసింది. బీఎస్-IV వాహనాల మనీలాండరింగ్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ ఛార్జ్‌షీట్‌ను ఫైల్ చేసింది.
ఈడీ ఛార్జ్‌షీట్‌లో భాగంగా.. హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసుకు సంబంధించి 17 మంది నిందితులు, సంస్థలపై ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేసింది. బీఎస్-4 నిబంధనలకు అనుగుణంగా లేని వాహనాలను ఏప్రిల్ 1, 2017 నుంచి భారతదేశంలో విక్రయించరాదని, రిజిస్ట్రేషన్ చేయకూడదని 2017లో సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ జేసీ ప్రభాకర్ రెడ్డి, సీ. గోపాల్ రెడ్డితో పాటుగా పలువురు అశోక్ లేల్యాండ్ లిమిటెడ్ నుంచి బీఎస్-3 వాహనాలను కొనుగోలు చేశారు.
ఈ క్రమంలో జటాధార ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్, సీ.గోపాల్ రెడ్డి అండ్ కో పేరుతో భారీ తగ్గింపుతో బీఎస్-3 వాహనాలను కొనుగోలు చేసి, మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నకిలీ పత్రాల ఆధారంగా బీఎస్-4 వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొంది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లలో ఎక్కువ కొనుగోళ్లు నాగాలాండ్‌లో జరుగగా.. కొన్ని కర్ణాటక, ఏపీలో కూడా జరిగాయని ఈడీ తెలిపింది.
జటాధార ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 50 వాహనాలు, సి.గోపాల్ రెడ్డి పేరిట 104 వాహనాలు రిజిస్టర్ అయినట్లు ఈడీ విచారణలో తేలింది. ఈ వాహనాల్లో చాలా వరకు వాటిని బీఎస్-4 వాహనాలుగా ఉపయోగించడం ద్వారా వారి రవాణా వ్యాపారంలో వారు మరింత ఉపయోగించుకున్నారు. అలాంటి కొన్ని వాహనాలను బీఎస్-4 వాహనాలుగా చూపి విక్రయించారు. ఈ వాహనాలను సొంతం చేసుకోవడం, నడపడం, విక్రయించడం ద్వారా 38 కోట్ల రూపాయలు ఆర్జించినట్టు ఈడీ పేర్కొంది. అంతకుముందు, జేసీ ప్రభాకర్ రెడ్డి, సీ గోపాల్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులకు చెందిన 68 కోట్ల చరాస్తులు.. 28.6 కోట్ల రూపాయల స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment