తిరుపతి రూరల్: మండలంలోని పుదిపట్లలో ఊహించినట్లే జరిగింది. ఊరు, పేరు, ఇంటి నంబర్లు లేని వందలాది దొంగ ఓట్లను తొలగించకుండానే ఎన్నికలు జరిగాయి. దొంగ ఓట్లకు నకిలీ ఆధార్‌కార్డులను సృష్టించారు. అందుకోసం ఏకంగా మీ–సేవ కేంద్రాన్నే స్థావరంగా మార్చుకున్నారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే మీ–సేవ కేంద్రంలో దొంగ ఆధార్‌కార్డులను తయారు చేస్తూ ఆదివారం పుదిపట్ల సర్పంచ్ ఇండిపెండెంట్ అభ్యర్థి బడి సుధాయాదవ్ అనుచరులు పట్టుబడ్డారు. స్థానికులు ఫిర్యాదుతో ఎంఆర్‌పల్లె పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. వారిలో బడి సుధా యాదవ్, వెంకటముని మునిచంద్రా, రవీంద్ర, మణికంఠ ఉన్నారు. వివరాల్లోకి వెళ్లితే.. పుదిపట్లలో దాదాపు 1,262 దొంగ ఓట్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు.
విచారణలో ద,త,మ,ప, ర, ఖ....ఇలా గుర్తు తెలియని పేర్లతో ఓటరు జాబితా ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. ఒకే వ్యక్తి సెల్ నంబర్‌తో 470కు పైగా ఓట్లు ఉన్నట్లు గుర్తించినా చర్యలు లేవు. 0, 00, 000, 0000.... ఊర్లో లేని ఇలాంటివే ఇంటి నంబర్లుగా పెట్టి జాబితాను నింపేశారు. వాటిని ప్రక్షాళన చేయాలని మొ త్తుకున్నా పట్టించుకోలేదు. ఆదివారం పుదిపట్ల లో ఓటింగ్ జరిగింది. ఊహించినట్లుగానే దొంగ ఓట్లు వేసేందుకు బయట వ్యక్తులు వచ్చారు. వారిని ఊరు, పేరు లేని వారి ఓటరు కార్డును చూసి మరోక గుర్తింపు కార్డు చూపించాలని ఏజెంట్లు, పోలింగ్ అధికారులు అడిగారు. దీంతో ఆధార్‌కార్డులను చూపించారు. డూప్లికేట్ తరహాలో ఉన్న ఆధార్ అడ్రస్‌లపై స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో ఆరా తీశారు. దొంగ ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తిని నిలదీయడంతో నకిలీ ఆధార్‌కార్డుల గుట్టు బయటపడింది.
ఫొటో ఉంచి, అడ్రస్ మార్చి.... దొంగ ఆధార్ కార్డులతో..
దొంగ అడ్రస్‌లతో ఓటరుగా నమోదు అయిన వ్యక్తులు, ఓటరు కార్డుతో పాటు గుర్తింపు కార్డు కోసం అడ్డదారులు తొక్కారు. అందుకోసం పేరూరు స్టాఫ్ క్వార్టర్స్ వద్ద ఉన్న మణికంఠ అనే వ్యక్తి మీ– సేవ కేంద్రాన్ని అడ్డగా మార్చుకున్నారు. ఫొటో మా త్రం ఉంచుకుని, పుదిపట్ల అడ్రస్‌తో నకిలీ ఆధార్‌కార్డులను తయారు చేసుకున్నారు. అక్కడ దాదాపు 500కు పైగా నకిలీ ఆధార్‌కార్డులు బయటపడ్డాయి. అక్కడే పుదిపట్ల సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బడి సుధాయాదవ్ అనుచరులు ఉన్నారు. వాళ్లే తమకు నకిలీ ఆధార్‌కార్డులు తయారు చేశారని చంద్రమౌళి అనే వ్యక్తి ఒప్పుకున్నాడు. దీంతో మీ– సేవ నిర్వాహకుడు మణికంఠతోపాటు ఐదుగురిపై ఎంఆర్‌పల్లె పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మొత్తం ఘటనలో కీలకమైన బడి సుధాయాదవ్ పుదిపట్ల సర్పంచ్‌గా గెలిచాడు. అతనిపై కూడా కేసు న మోదు అయ్యింది. దీంతో అతన్ని డిస్‌క్వాలిఫై చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
చదవండి:
నేనే చూసుకుంటా.. నేతలకు బాబు ఫోన్లు..!
నడిరోడ్డుపై విజయవాడ టీడీపీ నేతల రచ్చ
Comments
Please login to add a commentAdd a comment