భార్య ఉసురుతీసిన భర్త వివాహేతర బంధం | Extramarital Affair: Woman Commits Suicide In Khammam | Sakshi
Sakshi News home page

భార్య ఉసురుతీసిన భర్త వివాహేతర బంధం

Published Thu, Dec 16 2021 1:07 PM | Last Updated on Thu, Dec 16 2021 1:07 PM

Extramarital Affair: Woman Commits Suicide In Khammam - Sakshi

బానోత్‌ పద్మ (ఫైల్‌)  

సాక్షి, టేకులపల్లి (ఖమ్మం): భర్త అక్రమ సంబంధం భార్య ప్రాణాలను బలికొంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని సులానగర్‌ గ్రామానికి చెందిన బానోతు కస్నా, పద్మ (30) దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. బీఫార్మసీ చదివిన కుమార్తె తండ్రి ప్రవర్తన నచ్చక గత జూన్‌లో ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు తరుణ్‌ హైదరాబాద్‌లో బీటెక్‌ చదువుతున్నాడు.

కస్నా ఇదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయంలో కస్నా, పద్మ దంపతుల మధ్య చాలాకాలంగా గొడవలు జరగుతున్నాయి. ఈ నెల 9న రాత్రి కస్నా.. సదరు మహిళను వివాహం చేసుకునేందుకు ద్విచక్రవాహనంపై తీసుకెళ్తున్నాడనే సమాచారం పద్మకు తెలిసింది. వెంటనే పద్మ.. తన తమ్ముడిని తీసుకుని ద్విచక్రవాహనంపై వారిని వెంబడిస్తూ వెళ్లింది.

రాజుతండా దాటిన తరువాత తన భర్త వాహనంపై ఉన్న మహిళను లాగేందుకు ప్రయత్నించిన పద్మ అదుపు తప్పి కింద పడటంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే కొత్తగూడెం తరలించారు. అక్కడి నుంచి ఖమ్మం తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో రెండు రోజుల కిందటే హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.

తల్లి మరణవార్త తెలియగానే కుమారుడు తరుణ్‌ అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో ఫిర్యాదు చేయడంతో అక్కడ కేసు నమోదైంది. మృతదేహాన్ని సులానగర్‌కు తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు.

టేకులపల్లి ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ను వివరణ కోరగా సులానగర్‌కు చెందిన బాణోతు పద్మ (30) ఈనెల 9న ద్విచక్ర వాహనంపై వెళ్తూ అదుపు తప్పి కింద పడటంతో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ బుధవారం హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో మృతి చెందినట్లు తెలిపారు. అక్కడే కేసు నమోదైందని, ఆ కేసు టేకుపల్లికి ట్రాన్స్‌ఫర్‌ అయిన తరువాత పూర్తి వివరాలు విచారణలో తెలుస్తాయన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement