దంపతులు శ్రీలత, సురేశ్ (ఫైల్)
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ)/నిజామాబాద్ అర్బన్: అప్పులు, అధిక వడ్డీలు ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. అంచెలంచెలుగా ఎదిగిన ఆ కుటుంబం అప్పుల కారణంగా పరిస్థితులు తారుమారు కావడంతో రోడ్డున పడింది. ఆస్తులన్నీ అప్పులకే పోగా.. ఇంకా కట్టాల్సిన బకాయిల కోసం అప్పుల వాళ్లు ఎదురు చూస్తుండటంతో ఇక చావే శరణ్యమనుకున్నారు. పక్షం రోజుల పాటు ఊరూరా తిరిగారు. చివరకు ఏపీలోని విజయవాడ దుర్గమ్మ చెంత ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ గంగాస్థాన్ ఫేజ్–2లో నివాసం ఉంటున్న పప్పుల సురేశ్ (51), భార్య శ్రీలత (48), కుమారులు అఖిల్ (28), అశిష్ (24) ఈనెల 6న విజయవాడకు వచ్చారు. అఖిల్ పేరుతో సాయంత్రం ఐదు గంటల సమయంలో విజయవాడ బ్రాహ్మణవీధిలోని ఒక ప్రైవేట్ సత్రంలో రూమ్ తీసుకున్నారు. వారంతా శుక్రవారం దుర్గమ్మను దర్శించుకున్నారు. కాగా, అర్ధరాత్రి దాటాక సురేశ్ కుటుంబ సభ్యులు తమ బంధువులకు.. తాము చనిపోతున్నట్లు వాయిస్ మెసేజ్ పంపించారు.
దాంతో శ్రీలత సోదరుడు విజయవాడలో తమకు తెలిసిన వారికి ఫోన్లు చేసి సత్రం ఫోన్ నంబర్ కనుగొన్నారు. శనివారం ఉదయం ఆరున్నర గంటలకు సత్రానికి ఫోన్ చేసి తమ బంధువులు సత్రంలో బస చేశారని, వారు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మెసేజ్ పెట్టారని, తక్షణం వారిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సత్రం గుమాస్తా ఆ గదికి వెళ్లి చూసేసరికి తల్లి, కుమారుడు విగతజీవులుగా పడి ఉన్నారు.
ఈ సమాచారం తెలుసుకున్న సత్రం అధ్యక్షుడు పోలీసులకు సమాచారమిచ్చారు. అదే సమయంలో ప్రకాశం బ్యారేజీలో తండ్రీ, కొడుకుల మృతదేహాలు కనుగొన్నారు. వారి వద్ద ఉన్న ఆధారాలను బట్టి వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు.
అధిక మోతాదులో ఇన్సులిన్ తీసుకుని..
అశిష్ బీ ఫార్మసీ చదవడంతో మెడికల్ పరిజ్ఞానం ఉంది. దీంతో కుటుంబ సభ్యులంతా ఇన్సులిన్ అధిక మోతాదులో తీసుకుని చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వెంట తెచ్చుకున్న ఇంజెక్షన్లను ఆశిష్ సాయంతో అందరూ తీసుకున్నారు. దాంతో తల్లి శ్రీలత, చిన్న కుమారుడు ఆశిష్ ముందుగానే స్పృహ తప్పినట్లు తెలిసింది. ఆ తరువాత తండ్రి సురేశ్ పెద్ద కుమారుడు అఖిల్ నదిలో దూకాలని నిర్ణయించుకొని ప్రకాశం బ్యారేజీ మీదకు వెళ్లి 52వ కానా నుంచి నదిలోకి దూకారు.
ఆర్థిక ఇబ్బందులా.. ఇతర కారణాలా?
కేవలం ఆర్థిక ఇబ్బందులతోనే వీరు ఆత్మహత్యలకు పాల్పడ్డారా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నిజామాబాద్ నుంచి బంధువులు విజయవాడకు వస్తే వారు ఇచ్చే సమాచారాన్ని బట్టి అన్ని విషయాలు తెలుస్తాయని ఏసీపీ హనుమంతరావు తెలిపారు. కాగా, తన బావ సురేశ్ కుటుంబం ఆత్మహత్య చేసుకునేంతగా కోట్లలో అప్పులు లేవని మృతుని బావమరిది శ్రీనివాస్ ‘సాక్షి’కి తెలిపారు. ఎవరో తీవ్రంగా బెదిరించినందు వల్లే వారు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.
అప్పుల బాధ భరించలేక..
సత్రానికి వచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు మృతుల వివరాలు సేకరించారు. సురేశ్ కుటుంబం నిజామాబాద్‌లో మెడికల్ షాపుతో పాటు కిరాణా దుకాణాన్ని నిర్వహించేది. ఏడాది కిందట పెట్రోల్ బంక్‌లో మేనేజర్‌గా చేరిన పెద్దకుమారుడు బంక్‌ను తాను లీజుకు తీసుకున్నట్లు చెప్పి దాదాపు రూ.70 లక్షల వరకు అప్పు చేసినట్లు తెలిసింది. ఇదేకాక స్థానికంగా మరికొంతమంది వద్ద కూడా అప్పులు తీసుకోగా, వారు తీవ్రస్థాయిలో వేధింపులకు పాల్పడినట్లు సమాచారం.
మరో పక్క తమ ఫ్లాట్‌పై తండ్రి సురేశ్ సుమారు రూ.30 లక్షల మేర అప్పు చేసినట్లు తెలిసింది. కాగా, సురేశ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశారని వెల్లడైంది. పీసీహెచ్‌ఎఫ్‌ఎల్ అనే ఫైనాన్స్ సంస్థ బకాయిల వసూలు కోసం శుక్రవారం సురేశ్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లగా ఎవరూ లేకపోవడంతో ఫ్లాట్ గోడపై ‘ఈ ఆస్తి పీసీహెచ్‌ఎఫ్‌ఎల్’కి చెందినదిగా రాసి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. అప్పులు ఇచ్చినవారు, ఫైనాన్స్‌ల నుంచి ఒత్తిడి పెరగడంతో చివరకు ఆ కుటుంబం బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సురేశ్ కుటుంబం 15 రోజుల క్రితమే ఊరు వదిలి వచ్చినట్లు తెలిసింది.
అఖిల్ (ఫైల్) ఆశిష్ (ఫైల్ )
Comments
Please login to add a commentAdd a comment