మృతి చెందిన రాజు, హయాతి
మల్కాపురం (విశాఖ పశ్చిమ), అనకాపల్లి టౌన్: భార్య, భర్త, వారికో పాప.. చూడచక్కని కుటుంబం. అందాల హరివిల్లు.. ఆనందాల పొదరిల్లులాంటి వారి జీవితంలో ఒక్కసారిగా విషాదం కమ్ముకుంది. ఆదివారం సెలవని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరిన వారిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. సంఘటన స్థలంలోనే తండ్రీ కూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. కానీ ఆశ చావక వారిని కాపాడమంటూ ఆ ఇంటి ఇల్లాలు చేసిన రోదన చూపరులకు వేదన కలిగించింది. కళ్ల ముందే జరిగిన ఈ ఘోరాన్ని భరించలేక విలవిల్లాడిందామె. (చదవండి: విశాఖ సెంట్రల్ జైల్‌కు నూతన్ నాయుడు)
వడ్డాది మాడుగుల మండలం వీరనారాయణం గ్రామానికి చెందిన అగ్రహారపు రాజు (37), భార్య లక్ష్మి, నాలుగేళ్ల కుమార్తె హయాతిలతో కలిసి గాజువాక సమీపంలోని మల్కాపురం జాలరి వీధిలో నివసిస్తున్నాడు. గత పదేళ్లుగా రాజు నావల్ డాక్‌యార్డులోని ఎస్‌బీసీ (షిప్ బిల్డింగ్ సెంటర్)లో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. భార్య, బిడ్డలను తీసుకొని స్వగ్రామం వీరనారాయణం వెళ్లాలని ద్విచక్ర వాహనంపై ఉదయం 6 గంటలకు బయలుదేరాడు. జాతీయ రహదారిపై అనకాపల్లి డైట్ కళాశాల వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఈ దారుణం జరిగింది. లక్ష్మి స్వల్ప గాయాలతో బయటపడగా తండ్రీ కూతురు క్షణాల్లో ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న మృతుని బంధువులు, తన తోటి ఉద్యోగులు రోదించారు. లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనకాపల్లి ఎస్‌ఐ చెప్పారు.
అనారోగ్యంతో ఉన్న తనను కంటికి రెప్పలా కాపాడాడని, ఇప్పుడు తనను ఒంటరిని చేసి వెళ్లిపోయాడని భర్త మృతదేహంపై పడి లక్ష్మి కన్నీరుమున్నీరైంది. ఆరు నెలల క్రితం గైనిక్ సంబంధిత సమస్యతో బాధ పడుతున్న తనకు శస్త్రచికిత్స చేయించి, సపర్యలు చేసి ప్రాణం పోశాడని, ఇప్పుడిలా అనాథను చేసి మాయమయ్యాడని ఆమె తీవ్రంగా రోదించింది. (చదవండి: 12 నుంచి పట్టాలెక్కనున్న ప్రత్యేక రైళ్లు)
వీరనారాయణంలో విషాదఛాయలు
మాడుగుల రూరల్: విశాఖ– అనకాపల్లి జాతీయ రహదారిలో డైట్ కళాశాల వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తమ గ్రామానికి చెందిన అగ్రహారపు రాజు, అతని కుమార్తె మృతి చెందడంతో వీరనారాయణం విషాదంలో మునిగిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment