
శ్రీకాళహస్తి(తిరుపతి): ఓ తండ్రి క్షణికావేశం ముక్కు పచ్చలారని మూడు నెలల చిన్నారి ప్రాణాలను బలి తీసుకొంది. భార్యతో గొడవతో సహనం కోల్పోయిన ఆ తండ్రి.. బిడ్డను గోడకేసి కొట్టడంతో ఆ పసిప్రాణాలు అక్కడికక్కడే గాలిలో కలిసిపోయాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో శనివారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. శుకబ్రహ్మాశ్రమం సమీపంలోని వాటర్ హౌస్ కాలనీలో భార్యాభర్తలు మునిరాజా, స్వాతి నివాసముంటున్నారు. తాపీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
వీరిది ప్రేమ వివాహం. రెండేళ్ల తర్వాత వీరికి నిఖిల్ పుట్టాడు. ప్రస్తుతం నిఖిల్ వయసు మూడు నెలలు. నాలుగు రోజుల కిందట పిల్లాడికి న్యుమోనియా సోకడంతో తిరుపతిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించారు. ఇందుకోసం తన బైక్‌ను అమ్మేశాడు. రెండు రోజుల తర్వాత బిడ్డకు మళ్లీ జ్వరం రావడంతో.. నువ్వు ఆస్పత్రిలో సరిగా చూపించలేదంటూ భార్య గొడవకు దిగింది.
మరోసారి ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు తన తండ్రి బైక్‌ను తీసుకురాగా.. అప్పటికే వాళ్ల మధ్య విభేదాలుండటంతో ఆ బైక్ ఎక్కేందుకు ఆమె నిరాకరించింది. అంతేగాక తన తల్లిదండ్రుల మీద ఆమె నోరు పారేసుకోవడంతో మునిరాజా సహనం కోల్పోయాడు. అదే సమయంలో బాలుడు గుక్కపట్టి ఏడుస్తుండటంతో మునిరాజా.. బాలుడి కాళ్లు పట్టుకుని తలను గోడకేసి కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలుడి తండ్రిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు వన్ టౌన్ సీఐ అంజుయాదవ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment