
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: ఓ యువకుడి మోసం వల్ల తన మైనర్ కుమార్తె గర్భం దాల్చిందని.. అబార్షన్‌కు అనుమతించాలని ఓ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకు కారణమైన ఖలీద్‌పై కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ ఉదంతంపై చింతలపూడి పోలీసులు నమోదు చేసిన కేసును సీబీఐ లేదా సీఐడీకి అప్పగించాలని కోరారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం.. ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణ కోసం సింగిల్ జడ్జి వద్దకు పంపించింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది. తన కుమార్తెను కోర్టు ముందు హాజరుపరిచేందుకు ఆదేశాలివ్వడంతో పాటు పలు అభ్యర్థనలతో బాలిక తండ్రి, కుటుంబ స్నేహితురాలు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలను ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఇంతకుముందు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు సదరు బాలికను గురువారం కోర్టు ముందు హాజరుపరిచారు. తల్లిదండ్రులతో వెళ్లేందుకు బాలిక అంగీకరించడంతో.. ఆమెను తక్షణమే వారికి అప్పగించాలని పోలీసులను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment