
వేపాడ (శృంగవరపుకోట): కరోనా భయం ముగ్గుర్ని పొట్టన పెట్టుకుంది. విజయనగరం జిల్లా వేపాడ మండలం నల్లబిల్లి గ్రామానికి చెందిన ఉడత సత్యనారాయణ గుప్తా (62), భార్య సత్యవతి (57), అతడి అత్త సీహెచ్.వెంకట సుబ్బమ్మ (84) నూతిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కుటుంబం రెండేళ్లుగా విశాఖ జిల్లా చోడవరంలో ఉంటోంది. మూడు రోజుల క్రితం గుప్తాకు జ్వరం రావడంతో అతని కుమార్తె అన్నపూర్ణ, అల్లుడు ప్రసాద్ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు.
గుప్తాకు కరోనా ప్రాథమిక లక్షణాలు ఉన్నట్టు వైద్యులు చెప్పగా.. ఆ తర్వాత గుప్తా భార్య సత్యవతికి కోవిడ్ లక్షణాలు కనిపించాయి. దీంతో కలత చెందిన గుప్తా శుక్రవారం తన భార్య సత్యవతి, అత్త వెంకట సుబ్బమ్మతో కలిసి స్వగ్రామమైన నల్లబిల్లి వచ్చి.. గ్రామ పొలిమేరలో శివాలయం వెనుక గల నూతిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. నూతిలో మృతదేహాలను, నూతి బయట సంచిలో ఆధార్ కార్డులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, 3 గ్లాసులు, కంటి అద్దాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
కరోనా సోకిందన్న భయంతో మొదట పురుగు మందు తాగి, ఆ తరువాత నూతిలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. గుప్తా కుమారుడు సంతోష్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను శృంగవరపుకోట సీహెచ్‌సీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment