
రాజాం సిటీ: అమాయక మహిళలే టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు కిలేడీలను రాజాం రూరల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 50 వేలు స్వాదీనం చేసుకున్నారు. రాజాం రూరల్ సర్కిల్ స్టేషన్‌లో సీఐడీ నవీన్ వెల్లడించిన వివరాల ప్రకారం... బ్యాంకుల వద్ద మాటువేసి పిక్ పాకెటింగ్ చేయడమే పనిగా పెట్టుకుని ఆటోల్లో ప్రయాణిస్తున్న అమాయక మహిళల బ్యాగులు కాజేస్తున్నారు. ఇటీవల జి.సిగడాం మండలం మెట్టవలసకు చెందిన ఓ మహిళ రాజాం బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకుని ఆటో ఎక్కగా, పొగిరి దాటిన తర్వాత ఆమె బ్యాగును కట్ చేయడాన్ని గమనించి కేకలు వేసింది. వెంటనే నిందితురాలు జారుకోవడంతో జి.సిగడాం పోలీసులకు సమాచారం అందించింది.
ఈ నేపథ్యంలో మెట్టవలస జంక్షన్ వద్ద రెక్కీ నిర్వహిస్తున్న వారికి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలు చేస్తున్నట్లు అంగీకరించారు. ఇటువంటి దోపిడీ ముఠాలు వంగర మండలం కోదులగుమ్మడ, జియ్యమ్మవలస దగ్గర తురకనాయుడుపేట, గజపతినగరం దగ్గర పిట్టాడ, కొత్తవలస తదితర ప్రాంతాల్లో సంచరిస్తున్నాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అనుమానిత వ్యక్తులు కనిపించినా సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో జి.సిగడాం ఎస్సై మహ్మద్ ఆజాద్, ట్రైనీ ఎస్సై దివ్యజ్యోతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment