Pickpocketing
-
కిలేడీలు: అమాయక మహిళలే టార్గెట్!
రాజాం సిటీ: అమాయక మహిళలే టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు కిలేడీలను రాజాం రూరల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 50 వేలు స్వాదీనం చేసుకున్నారు. రాజాం రూరల్ సర్కిల్ స్టేషన్లో సీఐడీ నవీన్ వెల్లడించిన వివరాల ప్రకారం... బ్యాంకుల వద్ద మాటువేసి పిక్ పాకెటింగ్ చేయడమే పనిగా పెట్టుకుని ఆటోల్లో ప్రయాణిస్తున్న అమాయక మహిళల బ్యాగులు కాజేస్తున్నారు. ఇటీవల జి.సిగడాం మండలం మెట్టవలసకు చెందిన ఓ మహిళ రాజాం బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకుని ఆటో ఎక్కగా, పొగిరి దాటిన తర్వాత ఆమె బ్యాగును కట్ చేయడాన్ని గమనించి కేకలు వేసింది. వెంటనే నిందితురాలు జారుకోవడంతో జి.సిగడాం పోలీసులకు సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో మెట్టవలస జంక్షన్ వద్ద రెక్కీ నిర్వహిస్తున్న వారికి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలు చేస్తున్నట్లు అంగీకరించారు. ఇటువంటి దోపిడీ ముఠాలు వంగర మండలం కోదులగుమ్మడ, జియ్యమ్మవలస దగ్గర తురకనాయుడుపేట, గజపతినగరం దగ్గర పిట్టాడ, కొత్తవలస తదితర ప్రాంతాల్లో సంచరిస్తున్నాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అనుమానిత వ్యక్తులు కనిపించినా సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో జి.సిగడాం ఎస్సై మహ్మద్ ఆజాద్, ట్రైనీ ఎస్సై దివ్యజ్యోతి పాల్గొన్నారు. -
బస్సులో మహిళ చేతివాటం! ఏకంగా కండక్టర్‌కే..
సాక్షి, పట్నంబజారు(గుంటూరు): ఆర్టీసీ బస్సులో మహిళ చేతివాటం ప్రదర్శించిన ఘటన మంగళవారం జరిగింది. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో సురేష్‌బాబు, ఆర్టీసీ బస్ కండక్టర్ కేబీ పరమానందం తెలిపిన వివరాల ప్రకారం... బాపట్ల డిపోకు చెందిన బస్సు మంగళవారం చేబ్రోలు చేరుకుంది. కండక్టర్ పరమానందం పక్కనే ఓ మహిళ నిలబడి ఉంది. చేబ్రోలు నుంచి నారాకోడూరు వరకు వచ్చే లోపల కొన్ని టిక్కెట్లు కొట్టిన ఆయన చిల్లర కోసం నగదు తీసుకుని ప్రయాణికులకు ఇచ్చారు. నారాకోడూరు నుంచి బస్సు బయలుదేరిన తర్వాత మరికొంత మంది ఎక్కటంతో టిక్కెట్లు ఇచ్చి బ్యాగును తెరవటంతో నగదు కనిపించలేదు. ఉలిక్కిపడ్డ కండక్టర్ పరమానందం ప్రయాణికులను నగదు విషయం అడిగారు. ఎవరిలోనూ స్పందనలేదు. అయితే ఒక మహిళ తీరు అనుమానాస్పదంగా ఉండటంతో కండక్టర్, డ్రైవర్లు నిలదీశారు. ఈ క్రమంలో ఆమె చీరలో నుంచి నగదు కిందపడటాన్ని గమనించి, మహిళ తీసిందని నిర్ధారణకు వచ్చారు. నేరుగా బస్సును స్టేషన్‌కు తీసుకెళ్లారు. సదరు మహిళను విచారించిన పాతగుంటూరు పీఎస్ ఎస్‌హెచ్‌వో సురేష్‌బాబు, ఆమె పేరు మరియమ్మ అని చెబుతోందని, అయితే అదీ కూడా సరైన పేరు అయి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. సదరు మహిళను సీసీఎస్ పోలీసులకు అప్ప గించారు. కేసు చేబ్రోలు పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. సదరు మహిళ నుంచి కండక్టర్ రూ.17,400 స్వాధీనం చేసుకున్నారు. -
హలీం కోసం క్యూ : జేబు దొంగల హల్చల్
బంజారాహిల్స్ (హైదరాబాద్) : హలీం కోసం క్యూ లైన్లో నుంచున్న పలువురి జేబులకు దొంగలు చిల్లులు పెట్టారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాల ప్రకారం... హబ్సిగూడకు చెందిన కె. వీరభద్ర పార్థ డెంటల్‌లో సర్వీస్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. హలీంకు ఆఖరి రోజు కావడంతో శుక్రవారం రాత్రి బంజారాహిల్స్ రోడ్‌నెం.1లోని సర్వీ హలీం కేంద్రం వద్ద క్యూలో నిల్చున్నాడు. కొద్దిసేపటికి చూసుకోగా ఖరీదైన సెల్‌ఫోన్ మాయమైంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మెహిదీపట్నంకు చెందిన ఇస్మాయిల్ అనే విద్యార్థి హలీం కోసం క్యూలో నిల్చోగా పర్సు చోరీకి గురైంది. అందులో రూ.2 వేల నగదు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని నందినగర్‌కు చెందిన రాజశేఖర్ అనే యువకుడు కూడా హలీం కోసం క్యూలో నిల్చుని పర్సు పోగొట్టుకున్నాడు. ఇలా చాలామంది హలీం సెంటర్ల వద్ద పర్సులు, నగదు పోగొట్టుకున్నట్టు సమాచారం.