లక్నో: ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిపిన నిందితుడు సచిన్ పండిట్ నేరం అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు. ఒవైసీని చంపాలన్న ఉద్దేశంతో కాల్పులు జరిపినట్టు విచారణలో అతడు వెల్లడించాడని తెలిపారు.
బుల్లెట్లు తగిలే ఉంటాయనుకున్నా
‘నేనో పెద్ద రాజకీయ నాయకుడిని కావాలనుకున్నాను. కానీ ఒవైసీ రెచ్చగొట్టే ప్రసంగాలు విని కలత చెందాను. అందుకే నా స్నేహితుడు శుభమ్‌తో కలిసి ఒవైసీ హత్యకు పథకం వేశాను. నేను ఒవైసీపై కాల్పులు జరిపినప్పుడు ఆయన వంగిపోయాడు. దీంతో కిందకు కాల్పులు జరిపాను. ఒవైసీకి బుల్లెట్లు తగిలే ఉంటాయని అనుకున్నాను. తర్వాత అక్కడి నుంచి పారిపోయాన’ని పోలీసుల విచారణలో సచిన్ వెల్లడించాడు.
దాడికి చాలాసార్లు ట్రైచేశా
ఒవైసీపై దాడికి చాలా రోజులు నుంచి ప్రణాళిక తయారు చేసినట్టు చెప్పాడు. సోషల్ మీడియా ద్వారా ఎంపీ కదలికలను తెలుసుకునేవాడినని, దాడి చేయడానికి పలుమార్లు ఒవైసీ సమావేశాలకు కూడా వెళ్లినట్టు తెలిపారు. అయితే సమావేశాలకు జనం భారీ సంఖ్యలో రావడంతో దాడి చేయడం సాధ్యపడలేదని అన్నాడు. ‘ఒవైసీ మీరట్ నుంచి ఢిల్లీకి వెళతారని తెలుసుకుని.. నేను ఆయన కంటే ముందే టోల్‌గేట్ వద్దకు చేరుకున్నాను. ఒవైసీ కారు రాగానే కాల్పులు జరిపాన’ని పోలీసుల విచారణలో సచిన్ చెప్పినట్టు సమాచారం.
పిస్టల్ ఇచ్చింది అతడే
ఒవైసీపై కాల్పులకు సంబంధించి ఇప్పటివరకు సచిన్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు హాపూర్ అడిషినల్ ఎస్పీ తెలిపారు. సచిన్ నుంచి 9 ఎంఎం పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడికి పిస్టల్ సమకూర్చిన మీరట్‌కు చెందిన తలీమ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే సచిన్ ఉద్దేశం గురించి అతడికి తెలియదని విచారణలో తేలింది. కాగా, సచిన్ పండిత్ బీజేపీ నాయకులతో కలిసివున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (చదవండి: ఆంక్షలతో బతకలేను, చావుకు భయపడను)
Comments
Please login to add a commentAdd a comment