వడమాలపేట/తిరుమల:టెంపోలో వెళ్తున్న భక్తులను తిరుపతి జిల్లా ఎస్వీ పురం టోల్‌ప్లాజా సమీపంలో ఎదురుగా వస్తున్న టెంపో ట్రావెలర్ వాహనాన్ని హెరిటేజ్ మిల్క్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందగా.. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వడమాలపేట మండలం పుత్తూరు–తిరుపతి జాతీయ రహదారిపై అంజేరమ్మ కనుమ వద్ద ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. తిరుపతిలోని ఎస్‌ఆర్ ఇండియా ప్రైమ్ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ నిర్వాహకులు సుబ్రహ్మణ్యం, రాజశేఖర్‌రెడ్డి వడమాలపేట మండలం ఎస్వీ పురంలోని అంజేరమ్మకు మొక్కు చెల్లించుకునేందుకు ఆదివారం మధ్యాహ్నం కారులో బయలుదేరగా.. వారి కార్యాలయంలో పనిచేసే 12 మంది సిబ్బంది టెంపో ట్రావెలర్‌లో బయలుదేరారు. టెంపో టోల్‌ప్లాజా దాటి అంజేరమ్మ ఆలయానికి వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న దానిని హెరిటేజ్ ట్యాంకర్ ఢీకొట్టింది. ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న 12 మందితోపాటు మిల్క్ ట్యాంకర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
108 సిబ్బంది, టోల్ ప్లాజా అంబులెన్స్‌లో క్షతగాత్రులను పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఐరాల మండలానికి చెందిన రేవంత్ (44), ఆర్సీ పురానికి చెందిన గిరిజ (45) మృతి చెందారు. అక్కడి నుంచి క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ గంగాధర నెల్లూరుకు చెందిన హెరిటేజ్ మిల్క్ ట్యాంకర్ డ్రైవర్ శివకుమార్ (57), పాకాల మండలం శ్రీరంగరాజపురానికి చెందిన రేఖ (24), కుప్పానికి చెందిన అజయ్‌కుమార్ అలియాస్ అంజి (25) మృతి చెందారు.
తీవ్రంగా గాయపడిన నెల్లూరుకు చెందిన రాజశేఖర్, తిరుపతి కొత్తపల్లెకి చెందిన లతారెడ్డి, సత్యనారాయణపురానికి చెందిన కాంతిరేఖ, నారాయణరెడ్డి, రెడ్డిగుంటకు చెందిన కుమారస్వామిరెడ్డి, అన్నమయ్య జిల్లా రామాపురానికి చెందిన నరసింహులు, రాజంపేటకు చెందిన సుజాత, సత్యసాయి జిల్లాకు చెందిన ఆంజనేయులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే టెంపో డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వడమాలపేట పోలీసులు తెలిపారు.
ఘాట్ రోడ్డులో రెండు టెంపోలకు బ్రేక్ ఫెయిల్
కాగా, తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో రెండు టెంపో ట్రావెలర్ వాహనాలకు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. తిరుమల ట్రాఫిక్ డీఎస్పీ కొండయ్య తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు, చెన్నైకి చెందిన 12 మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని ఆదివారం తిరుపతికి తిరిగి వెళుతుండగా.. మొదటి ఘాట్ రోడ్డుపై నాలుగో మలుపు వద్ద వాహనం బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి బోల్తాపడింది.
ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది క్షత్రగాత్రులను అంబులెన్స్‌లో తిరుపతి రుయా ఆస్పత్రికి, అక్కడి నుంచి ఇద్దరిని టీటీ బర్డ్ ఆస్పత్రికి తరలించారు. మరో ప్రమాదంలో తిరుపతికి చెందిన టెంపో ట్రావెలర్ వాహనంలో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తిరుమల నుంచి తిరుపతికి దిగుతుండగా 9వ మలుపు వద్ద వాహనం బ్రేక్ ఫెయిలై రక్షణ గోడను ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో భక్తులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
Comments
Please login to add a commentAdd a comment