
చిన్నారుల మృతదేహాలను తీసుకెళ్తున్న బంధువులు
నవమాసాలు కడుపులో మోసి జన్మనిచ్చిన తల్లి తాను ఆత్మహత్య చేసుకుని మరణిస్తే తన పిల్లలను చూసుకునే వారు ఉండరని భావించింది. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న ఆ తల్లి కడుపున పుట్టిన పిల్లలను సైతం తన తోడు తీసుకెళ్లాలని భావించి వారిని తన కొంగుతో చుట్టుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన మేడ్చల్ మండలంలోని రాజబొల్లారం గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం భర్త వేధింపులు తాళలేక ముగ్గురు పిల్లలతో సహా ఆ మహిళ చెరువులో దూకింది. ఇద్దరు చిన్నారులతో సహా ఆమె మరణించిన విషయం విదితమే.
మేడ్చల్‌రూరల్: ఈ ఘటనలో శివరాణి పెద్ద కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. ఇద్దరు చిన్నారుల(దీక్షిత్, ప్రణీత)తో పాటు ఆమె మృతి చెందారు. శివరాణి మృతికి కారణమైన భర్త(భిక్షపతి)కు మృతురాలి బంధువులు దేహశుద్ధి చేశారు. మేడ్చల్ పోలీసులు మృతదేహాలను గాంధీ మార్చురికి తరలించారు.
కలహాలతో పిల్లలు బలి..
భార్యాభర్తల మధ్య గొడవ అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. మేడ్చల్ పోలీసులు భర్త భిక్షపతి, అత్త రాములమ్మను అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వారిపై 498ఏ, 302, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
గ్రామంలో విషాదఛాయలు..
శివరాణి, పిల్లలు దీక్షిత్, ప్రణీతల మృతదేహాలకు గురువారం గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు రాజబొల్లారం గ్రామానికి మృతదేహాలు చేరుకోవడంతో అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నారుల మృతదేహాలను మృతురాలి తండ్రి, బంధువులు తమ చేతుల్లో పట్టుకుని తీసుకెళ్లిన దృశ్యం అందరినీ కలచివేసింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రాణాలతో బయటపడిన మరో కుమారుడు జగదీశ్‌ను మృతురాలి తల్లిదండ్రులు చెంత ఉన్నాడు. అంత్యక్రియలు ముగిసే వరకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
చదవండి: జూబ్లీహిల్స్: తాళాలు పగలగొట్టి.. దౌర్జన్యంగా ప్రవేశించి..
Comments
Please login to add a commentAdd a comment