(ఫైల్ ఫోటో)
సాక్షి, విజయవాడ: నగరంలోని పటమటలో జరిగిన గ్యాంగ్‌వార్ తరహా ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేదారేశ్వరపేట ఖుద్దూస్‌నగర్‌కు చెందిన షేక్ నాగుల్‌మీరా(మున్నా), రాహుల్ అనే యువకుల వర్గాల మధ్య పాత గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 31వ తేదీన రాహుల్‌తో పాటు అయోధ్యనగర్‌కు చెందిన వినయ్ తదితరులు కేదారేశ్వరపేటలో కత్తులు, కర్రలతో నాగుల్‌మీరా వర్గంపై దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత అదే రోజు రాత్రి 7.30 గంటల సమయంలో నాగుల్‌మీరా వర్గానికి చెందిన ఈసబ్, సాయికుమార్ తదితరులు అయోధ్యనగర్ బసవతారకనగర్ రైల్వే క్యాబిన్ సమీపంలో వినయ్, రాహుల్ తదితరులపై కత్తులు, ఇతర మారణాయుధాలతో దాడి చేశారు. పరస్పర దాడులు తర్వాత ఇరువర్గాలు బయటకు రాలేదు. (గ్యాంగ్‌వార్.. రౌడీషీటర్‌పై హత్యాయత్నం)
ఇదిలా ఉండగా అయోధ్యనగర్‌కు చెందిన పుట్టా వినయ్ (18) ఈ నెల 9వ తేదీన తనపై ఖుద్దూస్‌నగర్‌కు చెందిన షేక్ నాగుల్‌మీరా(25), న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన షేక్ ఈసబ్ (26), బుడమేరు మధ్యకట్ట ప్రాంతానికి చెందిన లావేటి సాయికుమార్(24), సీతన్నపేటకు చెందిన నాగులాపల్లి సాయి పవన్(20), కృష్ణలంకకు చెందిన కంది సాయికుమార్ (20)లతో పాటు మరికొందరు దాడి చేసినట్లు అజిత్‌సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పుట్టా వినయ్ ఫిర్యాదు చేసిన వారిలో నాగుల్‌మీరా, ఈసబ్, సాయికుమార్, సాయిపవన్, కంది సాయికుమార్‌లతో పాటు మరో ఇద్దరు బాలలను సోమవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు.
అరెస్టు చేసిన వారి నుంచి ఓ ద్విచక్రవాహనం, కత్తులు స్వాధీనం చేసుకున్నామని, దాడి పూర్వాపరాలను పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు వివరించారు. తనపై 9 మంది వ్యక్తులు కత్తులు, ఇతర మారణాయుధాలతో కేదారేశ్వరపేట ప్రాంతంలో దాడి చేశారంటూ షేక్ నాగుల్‌మీరా (మున్నా) ఆదివారం సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సోమవారం ఖుద్దూస్‌నగర్‌కు చెందిన రాహుల్, పటమటకు చెందిన సాయికిరణ్, అయోధ్యనగర్‌కు చెందిన పుట్టా వినయ్, వికాస్ అనే యువకులను అరెస్టు చేసినట్లు సీఐ బాలమురళీకృష్ణ తెలిపారు. వీరి నుంచి సైతం కత్తులు స్వాధీనం చేసుకున్నామని, మరో అయిదుగురు కోసం గాలిస్తున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment